కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో లాజిస్టిక్స్ దిగ్గజం గేట్‌వే డిస్ట్రిపార్క్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ లాభాలతో కళకళలాడుతున్నాయి. ఇతర వివరాలు ఇవీ..
టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్
మూడు రోజులుగా బలపడుతూ వస్తున్న టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ తాజాగా ఎన్‌ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసింది. రూ. 580 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లి రూ. 592కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. గత రెండు నెలల్లో ఈ షేరు 46 శాతం పురోగమించింది. కాగా.. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 53,000 కోట్లను అధిగమించింది. తద్వారా గ్రూప్‌లోని ఇతర దిగ్గజాలు టాటా స్టీల్, టాటా మోటార్స్ విలువను దాటేసింది. ఈ ఏడాది క్యూ1లో ఇబిటా 37 శాతం ఎగసి రూ. 486 కోట్లను తాకగా.. నిర్వహణ మార్జిన్లు 3.12 శాతం బలపడిన విషయం విదితమే.
గేట్‌వే డిస్ట్రిపార్క్స్
సమీకృత లాజిస్టిక్స్ కార్యకలాపాలు కలిగిన గేట్‌వే డిస్ట్రిపార్క్స్ వ్యాపార పునర్వ్యవస్థీకరణను చేపట్టనుంది. ఇందుకు బుధవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. కంపెనీకిగల వివిధ వ్యాపార విభాగాలను గ్రూప్‌లోని విభిన్న సంస్థలు నిర్వహస్తున్న కారణంగా పునర్వ్యవస్థీకరణకు ప్రతిపాదించినట్లు తెలియజేసింది. తద్వారా వివిధ కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గేట్‌వే డిస్ట్రిపార్క్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత దాదాపు 15 శాతం దూసుకెళ్లి రూ. 108కు చేరింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 6.5 శాతం జంప్‌చేసి రూ. 101 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో షేరుకి రూ. 72 ధరలో చేపట్టిన రైట్స్ ద్వారా కంపెనీ రూ. 116 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment