న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ రాబోయే రోజుల్లో అధిక వృద్ధి వ్యూహాల్లో భాగంగా ప్రధానంగా నాలుగు అంశాలపై మరింతగా దృష్టి పెట్టనుంది. డిజిటల్, కొత్త ఇంధనాలు, దీటైన సరఫరా వ్యవస్థ, ఆరోగ్యం వీటిలో ఉండనున్నాయి. దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశించి ఇచ్చిన నూతన సంవత్సర సందేశంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు.
వైరస్ వ్యాప్తికి సంబంధించి కొత్త వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనే విధంగా ఇటు సమాజం, అటు వ్యాపారాలు సన్నద్ధమై ఉండాలని ఆయన సూచించారు. గత ఏడాది అనుభవాలను ప్రస్తావిస్తూ.. గ్రూప్ స్వరూపం ప్రస్తుతం మరింత సరళంగా, ఆర్థికంగా పటిష్టంగా మారిందని చంద్రశేఖరన్ చెప్పారు. ‘కొత్త టెక్నాలజీల తోడ్పాటుతో కర్బన ఉద్గారాలను నియంత్రించడంలోనూ, మన కంపెనీలు ప్రయోజనాలు అందిపుచ్చుకోవడంలోనూ చెప్పుకోతగ్గ పురోగతి సాధించగలిగాం.
ఎయిరిండియాను దక్కించుకోవడం ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయి. ఇది చరిత్రాత్మక సందర్భం‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త థీమ్‌లకు టాటా గ్రూప్ సంస్థలు ఇప్పటికే అలవాటుపడుతున్నాయని, పటిష్టమైన పనితీరు కనపరుస్తున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో 5జీ మొదలుకుని టాటాన్యూ (డిజిటల్ ప్లాట్‌ఫాం), టాటా ఎలక్ట్రానిక్స్ వంటి వివిధ విభాగాలు ఈ నాలుగు థీమ్స్‌తో గణనీయంగా ప్రయోజనం పొందగలవని చంద్రశేఖరన్ చెప్పారు.
వైరస్‌పై ఆధారపడి ఉంటుంది..
2024 నాటికి 3 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న దేశ లక్ష్యాలను సాధించడంలో టాటా గ్రూప్ తన వంతు పాత్ర పోషించగలదని చంద్రశేఖరన్ వివరించారు. ‘సరళతర .. సుస్థిరమైన విధానాలను పాటిస్తూ, అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేయాలి. అలా చేయగలిగితే మన కంపెనీని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలం. అయితే, ఈ ఆకాంక్షలన్నీ కూడా ఒక అంశంపై ఆధారపడి ఉంటాయి. అదేంటంటే కరోనావైరస్‌తో కలిసి జీవించడాన్ని నేర్చుకోవడం. కొత్తగా మరింత వ్యాప్తి చెందినా, మరిన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కొనగలిగేందుకు వ్యాపారాలు, సమాజం అలవాటుపడగలగాలి.
సర్వసన్నద్ధంగా ఉండగలగాలి. ఒమిక్రాన్ విషయంలో ఇది కనిపిస్తోంది. దేశీయంగా భారీ స్థాయిలో అమలు చేసిన టీకాల పథకం ఒక రక్షణ గోడను నిర్మించింది. ఇప్పటివరకూ వ్యాప్తి తీవ్రత ఒక మోస్తరుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అలసత్వం మంచిది కాదు‘ అని చంద్రశేఖరన్ చెప్పారు. కోవిడ్–19 కారణంగా కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టకాలంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడటంలో తోడ్పాటునిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment