‘టీకా’ వేశాం.. ఢోకాలేదు
న్యూఢిల్లీ: కరోనా వైరస్పరమైన సవాళ్లను అధిగమిస్తూ భారత్ అధిక వృద్ధి బాటలో ముందుకు దూసుకెళ్లనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా తన స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది. భారీ స్థాయిలో కొనసాగుతు న్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి వంటివి ఇందుకు దోహదపడనున్నాయి.
సోమ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఎకానమీకి తోడ్పాటునిచ్చేందుకు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థికపరంగా తగినంత వెసులుబాటు ఉందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకోతగిన చర్యలను సూచించే దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా మంత్రి తగు ప్రతిపాదనలు చేస్తారన్న అంచనాలు నెలకొన్న నేపథ్యంలో సర్వేలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అదుపులోనే ద్రవ్యోల్బణం..
సరఫరా వ్యవస్థను మెరుగ్గా నిర్వహించడంతో పాటు ఇంధనాలపై సుంకాలను తగ్గించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ధరలు దాదాపు అదుపులోనే ఉన్నాయని సర్వే పేర్కొంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల రేట్లు పెరిగిపోయాయని .. కానీ ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి కొంత మేర కట్టడి చేసిందని తెలిపింది.
రిస్కులూ ఉన్నాయ్..
ఇంధన ధరలు అధిక స్థాయిల్లో ఉంటున్న నేపథ్యంలో దిగుమతిపరమైన ద్రవ్యోల్బణం కాస్త ఆందోళనకరంగా ఉండవచ్చని ఆర్థిక శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు, ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరలు అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ రేటు కూడా భారీగా ఎగుస్తుంది.
‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాం శాలు, వాతావరణం మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ అనంతర ప్రపంచం గురించి అనిశ్చితి నెలకొంది’’ అని సన్యాల్ తెలిపారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు ప్రస్తుతం 90 డాలర్ల స్థాయిలో తిరుగాడుతున్నప్పటికీ.. వచ్చే ఏడాది 70–75 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని సర్వే అంచనా వేసింది.
అలాగే వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు లిక్విడిటీ ఉపసంహరణను ఎకాయెకిన కాకుండా క్రమపద్ధతిలోనే చేయవచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఇంకా అనిశ్చితి నెలకొందని, మిగతా దేశాల్లో అధిక వడ్డీ రేట్లు గానీ లభిస్తే భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోయే అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. సర్వేలో పేర్కొన్న 2022–23 వృద్ధి.. ప్రపంచ బ్యాంకు అంచనాలకు అనుగుణంగా, ఎస్అండ్పీ.. మూడీస్ అంచనాలకన్నా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 9% కన్నా తక్కువగానే ఉండటం గమనార్హం.
ప్రైవేట్ పెట్టుబడుల జోరు..
ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడే స్థాయిలోనే ఆర్థిక స్థితిగతులు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోగలవని సర్వే తెలిపింది. పన్ను వసూళ్లు మెరుగుపడటంతో ప్రభుత్వం తగు స్థాయిలో వ్యయాలు చేసేందుకు వెసులుబాటు లభించగలదని పేర్కొంది.
క్రిప్టో కరెన్సీ పట్ల తటస్థ విధానం: సంజీవ్ సన్యాల్
దేశ ఆర్థిక స్థిరత్వంపై క్రిప్టో కరెన్సీల ప్రభావం ఉంటుంది కనుక.. వాటి నియంత్రణ విషయంలో తటస్థ వైఖరిని ప్రభుత్వం తీసుకుంటుందని సంజీవ్ సన్యాల్ అన్నారు. ప్రస్తుతానికి దేశంలో క్రిప్టో కరెన్సీల నిషేధం, అనుమతికి సంబంధించి ఎటువంటి చట్టాలు అమల్లో లేవు. సోమవారం పార్లమెంట్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఆర్థిక సర్వేలోనూ క్రిప్టోల ప్రస్తావన లేకపోవడంపై సన్యాల్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘మీకు తెలిసిందే ఈ అంశంపై ప్రభుత్వంలోను, ఆర్థిక శాఖ పరిధిలో, పార్లమెంట్లోనూ చర్చ నడుస్తోంది. ఆర్థిక స్థిరత్వ సమస్యలున్నాయి. మరోవైపు ఆవిష్కరణల కోణంలో చర్చ కూడా నడుస్తోంది. కనుక తటస్థ విధానాన్ని ఈ విషయంలో తీసుకోవడం జరుగుతుంది’ అని సన్యాల్ వివరించారు.
సర్వేలో ఇతర హైలైట్స్..
► ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ కరోనా పూర్వ స్థాయికి పుంజుకున్నాయి. 2022–23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎకానమీ సర్వసన్నద్ధంగా ఉంది.
► కరోనా సవాళ్లను అధిగమించేందుకు ఇతర దేశాల తరహాలో ముందస్తుగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడం కాకుండా భారత్ .. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా విధానాలను అమలు చేసింది. డిమాండ్ నిర్వహణ కాకుండా సరఫరా వ్యవస్థపరమైన సంస్కరణలతో మహమ్మారి సృష్టించిన సమస్యలను ఎదుర్కొంది.
► భారీ ఎగుమతుల వృద్ధి, మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న వెసులుబాటు తదితర అంశాలు వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధికి తోడ్పడనున్నాయి.
► ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉండటంతో ప్రైవేట్ రంగ పెట్టుబడులు కూడా పుంజుకుని ఎకానమీ పునరుజ్జీవానికి దోహదపడగలవు.
► అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లోటు, రుణ భారాలు భారీగా పెరిగిపోయినప్పటికీ 2021–22లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడనుంది.
► విదేశీ మారకం నిల్వలపరంగా ‘బలహీనమైన అయిదు’ దేశాల్లో ఒకటిగా కొనసాగిన భారత్ ప్రస్తుతం అత్యధికంగా ఫారెక్స్ నిల్వలున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎదిగింది. దీంతో విధానపరంగా మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు లభించనుంది.
► బేస్ ఎఫెక్ట్ కారణంగానే టోకు ధరల ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంటోంది. ఇది క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
► అంతర్జాతీయంగా కంటైనర్ మార్కెట్లో అవాంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంపై ఈ ప్రభావం కొనసాగనుంది.
మహమ్మారి తొలగితే పెట్టుబడులు రయ్: నాగేశ్వరన్
కరోనా మహమ్మారి నియంత్రణలోకి వస్తే సానుకూల పెట్టుబడుల వాతావరణం జోరందుకుని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని నూతనంగా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) ఎ.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. తక్కువ ఆదాయ వర్గాల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కువ ఉపాధి కల్పించే నిర్మాణ రంగం ఇప్పటికే పుంజుకోవడం మొదలైనట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం 4 అంచెల విధానం అనుసరిస్తోంది. అనిశ్చిత సమయాల్లో ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా బాధిత వర్గాలకు అండగా నిలవడం. అదే సమయంలో ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టడం. మహమ్మారి కారణంగా నిర్మాణాత్మక, సరఫరా వైపు సంస్కరణల అవకాశాలను విడిచిపెట్టకపోవడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకుంది. సంస్కరణల ప్రక్రియపై ఎంతో శ్రద్ధ, ప్రాధాన్యం చూపిస్తోంది’ అని చెప్పారు.
‘‘ప్రపంచ ఎకానమీకి ఇది కష్టకాలం. పలు దఫాలుగా విజృంభిస్తున్న మహమ్మారి కారణంగా తలెత్తిన అనిశ్చితితో ప్రస్తుతం ఏర్పడిన అవాంతరాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా ప్రభావాలు ఉండనున్నాయి. టెక్నాలజీలు, వినియోగదారుల ధోరణులు, సరఫరా వ్యవస్థలు మొదలైన వాటన్నింటిలోనూ వేగవంతంగా మార్పులు వచ్చిన కారణంగా కోవిడ్ తర్వాత ప్రపంచమంతా అనిశ్చితి నెలకొన్నా భారత్ వీటిని అధిగమిస్తోంది ’’
– ఎకనమిక్ సర్వే ప్రధాన రూపకర్త సంజీవ్ సన్యాల్
ఈసారి 9.2%, వచ్చేసారి 8.5%.. 2021–22 సర్వే అంచనా
► కరోనా కష్టకాలంలోనూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగా భారత్ స్థానాన్ని నిలబెట్టుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.2%, వచ్చే ఆర్థిక సంవత్సరం 8–8.5% స్థాయిలో వృద్ధి సాధించనుంది.
► భారీ స్థాయిలో కొనసాగుతున్న టీకాల ప్రక్రియ, సరఫరా తరఫున సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న సంస్కరణలు, నిబంధనల సరళీకరణ, భారీ ఎగుమతుల వృద్ధి తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. సోమవారం పార్ల మెంటులో ప్రవేశపెట్టిన 2021–22 ఆర్థిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
► 2025 ఆర్థిక సంవత్సరానికల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగాలని నిర్దేశించుకున్న క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై 1.4లక్షల కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.
► ఎయిరిండియా విక్రయ వ్యవహారం.. డిజిన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకునేందుకే కాకుండా ప్రైవేటీకరణ ప్రక్రియకు గణనీయంగా ఊతం ఇవ్వగలదు.
► ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.6 శాతం. ఈ నేపథ్యంలో పంటల్లో వైవిధ్యానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు, నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.