కంపెనీలు లాభాలు పెంచి చూపిస్తాయ్
- అవినీతి విధానాలకు పాల్పడతాయ్
- ఎర్నస్ట్ అండ్ యంగ్ సర్వే
న్యూఢిల్లీ: అధిక వృద్ధిని కనపర్చాల్సిన ఒత్తిడి కారణంగా చాలా మటుకు కంపెనీలు లాభాలు పెంచి చూపడం, అవినీతి విధానాలకు పాల్పడటం వంటివి చేస్తున్నాయని దేశీయంగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు భావిస్తున్నారు. అలాగే, వ్యాపారాలకు సంబంధించి లంచాలివ్వడం, అవినీతికి పాల్పడటం మొదలైనవి సర్వసాధారణమని వారు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ ఈవై(ఎర్నస్ట్ అండ్ యంగ్)నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడించారు. కంపెనీలు తమ పనితీరును ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తుంటాయని, ఇందుకోసం అవి ఆర్థిక ఫలితాల్లో అవకతవకలకు పాల్పడుతుంటాయని 40% మంది భావిస్తున్నట్లు ఈవై పేర్కొంది. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ కంపెనీలు నడుస్తున్నాయని, వ్యాపారంలో వృద్ధి కనపర్చేందుకు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని వివరించింది.
నైతికతపై పెరుగుతున్న అవగాహన ..
వ్యాపారాల్లో నైతిక విలువల గురించి అవగాహన పెరుగుతోన్నట్లు సర్వే ద్వారా వెల్లడైందని ఈవై పార్ట్‌నర్ అర్పిందర్ సింగ్ తెలిపారు. నియంత్రణ సంస్థలు మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితులు మారుతున్నాయని, ఇది భారతీయ వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. సర్వే ప్రకారం.. భారత్ ఊహించిన దానికంటే తక్కువ ఆర్థిక వృద్ధి సాధిస్తోందని 67 శాతం మంది భావిస్తున్నారు.
ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు నైతిక నియమావళికి కట్టుబడి ఉండాలంటే మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొంగొత్త ఆదాయ అవకాశాలను అన్వేషించాలంటూ మేనేజర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని 81 శాతం మంది తెలిపారు. అధిక రిస్కులున్న మార్కెట్లలోకి ప్రవేశించాలంటూ ఒత్తిడి పెరుగుతోందని 66 శాతం మంది పేర్కొన్నారు.
కంపెనీలు వ్యక్తిగత బహుమతులు, నగదు చెల్లింపులు ఇవ్వడం లేదా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సాధారణమేనని 59 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. భారత్‌తో పాటు యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని మొత్తం 38 దేశాల్లో ఈవై ఈ సర్వే నిర్వహించింది. సుమారు 3,800 మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.