న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రుణ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో పన్ను ఎగవేతలను, అక్రమ నిధుల ప్రవాహానికి (ఐఎఫ్‌ఎఫ్) అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఓఈసీడీ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా ఆసియా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇలాంటి వాటివల్ల 2016లో 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) తెలిపింది.
ఒక అధ్యయనం ప్రకారం ఆసియా ఆర్థిక సంపదలో దాదాపు నాలుగు శాతం (సుమారు 1.2 ట్రిలియన్ యూరోలు) విదేశాల్లో చిక్కుబడి ఉందని ’ఆసియాలో పన్నులపరమైన పారదర్శకత 2023’ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. దీనివల్ల 2016లో ఆసియా ప్రాంత దేశాలకు వార్షికంగా 25 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొంది.
పన్నుల విషయంలో పారదర్శకత పాటించేందుకు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఏర్పాటైన గ్లోబల్ ఫోరం సమావేశం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లోబల్ ఫోరంలో 167 దేశాలకు సభ్యత్వం ఉంది.
నివేదికలో మరిన్ని విశేషాలు..
♦ కోవిడ్–19 మహమ్మారి, తదనంతర భౌగోళిక రాజకీయ సంక్షోభాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించింది. ప్రజారోగ్యం, సామాజిక.. ఆర్థికపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింతగా వెచ్చించాల్సి వస్తోంది.
♦ ప్రస్తుతం పన్నులపరమైన ఆదాయాలు తగ్గి, దేశాల ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇక రుణ భారం, వడ్డీ రేట్లు పెరిగిపోతుండటం, వర్ధమాన దేశాల్లో వడ్డీలు చెల్లించే సామర్థ్యాలు తగ్గుతున్నాయి.
♦ 2004–2013 మధ్య కాలంలో ఐఎఫ్‌ఎఫ్ కారణంగా వర్ధమాన దేశాలు 7.8 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు నష్టపోగా, ఇందులో ఆసియా దేశాల వాటా 38.8 శాతంగా ఉంది.
♦ పన్ను ఎగవేతలు, ఐఎఫ్‌ఎఫ్‌లు దేశీయంగా ఆ దాయ సమీకరణకు అవరోధాలుగా మారాయి. అంతర్జాతీయంగా కూడా ఇది సమస్యగా ఉంది.
♦ ఐఎఫ్‌ఎఫ్‌ల పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. పన్నులపరమైన పారదర్శకతను పెంచేందుకు ప్రాంతీయంగా తీసుకునే చర్యలు మాత్రమే వీటిని కట్టడి చేయగలవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment