
Tesla: ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశంలో టెస్లా (Tesla) కంపెనీ ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సంస్థ కోసం టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కోసం పూణే విమాన్ నగర్‌లోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో కార్యాలయ స్థలాన్నిఅద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టెస్లా బృందం గత వారం ఎలక్ట్రిక్ కార్ల విక్రయానికి సంబంధించిన ప్రోత్సాహకాలను, ప్రయోజనాలను గురించి వాణిజ్య, పరిశ్రమల మంత్రిని కలిసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్..
టెస్లా యూనిట్..
భారతదేశంలో టెస్లా యూనిట్ త్వరలోనే ఏర్పాటు కానున్నట్లు సమాచారం. సుమారు 5,580 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆఫీస్ స్పేస్ కోసం నెలకు అద్దె రూ. 11.65 లక్షల వరకు ఉండనుంది. అద్దె 2023 అక్టోబర్ 01 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ స్పేస్‌ను 5 సంవత్సరాలు లీజుకి తీసుకున్నట్లు, ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ కోసం రూ. 34.95 లక్షలు చెల్లించనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఈ గడువును పెంచుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. కాగా గతంలో ఒక సారి బెంగళూరులో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలు తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయాలని సంస్థ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment