అమెరికాలో టిక్‌టాక్ తన సేవలను పునరుద్ధరించిందని, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇందుకు కారణమని పేర్కొంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ తాత్కాలికంగా నిలిచిపోతుందని అందరూ భావించారు. ఇది మిలియన్ల మంది అమెరికన్ వినియోగదారులపై ప్రభావం చూపుతుందని అనుకున్నారు. అయితే, ట్రంప్ జోక్యంతో యాప్‌ను తిరిగి పునరుద్ధరించడంతో యూజర్లకు ఊరట లభించింది.
ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. మిలియన్ల మంది అమెరికన్లు ఈ యాప్‌పై ఆధారపడ్డారని ఆయన నొక్కిచెప్పారు. ఈ యాప్ యూఎస్‌లో కొనసాగేలా, ఇది నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మధ్యవర్తిత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇది సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన స్పష్టతను అందించింది. దాంతోపాటు టిక్‌టాక్ జరిమానాలు ఎదుర్కోకుండా తాత్కాలికంగా కాపాడినట్లయింది.
అసలు వివాదం ఏమిటి?
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని ఇటీవల అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.
భద్రతపై ఆందోళనలు
అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. తాజాగా ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్‌టాక్ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది.
ఇదీ చదవండి: ఆరోపణలపై పోరాడేందుకు న్యాయ సంస్థల నియామకం
భవిష్యత్తుపై ప్రశ్నలు
టిక్‌టాక్‌కు తక్షణ సంక్షోభం తప్పినప్పటికీ, అమెరికాలో కంపెనీ భవిష్యత్తుపై ప్రశ్నలు వస్తున్నాయి. అమెరికాలో తన కార్యకలాపాలు సాగించాలంటే మాత్రం ఏదైనా యూఎస్ కంపెనీతో చైనీస్ మాతృసంస్థ బైట్ డాన్స్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని ట్రంప్ సూచించారు. అందులో అమెరికన్ ఇన్వెస్టర్లు కనీసం 50 శాతం వాటా కలిగి ఉండాలి. అమెరికాలో ఈ యాప్ కార్యకలాపాలు కొనసాగేలా చూస్తూనే జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడం సవాలుగా మారనుంది.
Comments
Please login to add a commentAdd a comment