restore
-
కెనడా పౌరులకు వీసా సేవల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్.. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం(Indian High Commission) బుధవారం ప్రకటనల విడుదల చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సి వచ్చిందని.. సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు భారత హైకమిషన్ ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ప్రమేయంలో భారత ఏజెంట్ల జోక్యం ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రత్యక్షంగా ఆరోపణలు ఇరు దేశాల మధ్య గ్యాప్ నెలకొంది. భారత్‌కు కెనడాకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి ఇరు దేశాలు. -
పురాతన ఆలయాలకు ‘శ్రీవాణి’ వైభవం
తిరుమల: పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, హిందూ ధార్మిక ప్రచార, సేవా కార్యక్రమాలే లక్ష్యంగా శ్రీవాణి ట్రస్టు ముందుకు దూసుకుపోతోంది. భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 176 పురాతన ఆలయాలను పునరుద్ధరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 2,273 నూతన ఆలయాలు నిర్మించి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే 501 ఆలయాలకు ధూపదీప నైవేద్యం కింద ప్రతి నెల రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2019లో ట్రస్ట్ విధివిధానాలు ఖరారు: నూతన ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించింది. 2018 ఆగస్టు 18వ తేదీనే ట్రస్ట్‌ను అప్పటి ప్రభుత్వం ప్రారంభించినా విధివిధానాలు మాత్రం 2019 సెపె్టంబర్ 23వ తేదీ ఖరారు చేశారు. అప్పటి వరకు కూడా టీటీడీ ట్రస్ట్‌లకు సంబంధించి లక్ష రూపాయలపైగా ఇచ్చిన దాతలకు మాత్రమే దర్శన సౌలభ్యం కల్పించేది. మొదటిసారి రూ.10 వేలను శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంగా అందించిన భక్తులకు ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ప్రోటోకాల్ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రోటోకాల్ బ్రేక్ దర్శనంతో ఆదరణ: వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్‌కు భక్తుల నుంచి విశేష స్పందన రావడానికి ప్రధాన కారణం విధివిధానాలే. అప్పటి వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలకు భక్తులు సిఫార్సు లేఖలు ద్వారా పొందడం లేదా అధిక మొత్తాన్ని దళారులకు చెల్లించి టికెట్లను పొందేవారు. శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభంతో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా ట్రస్ట్‌కు రూ.10 వేలు చెల్లిస్తే చాలు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం పొందే సౌలభ్యం టీటీడీ కల్పించింది. భక్తులు మరో మాటకు తావివ్వకుండా శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఒక దశలో రోజుకు 2,700 మంది భక్తులు కూడా విరాళాలు అందించడం విశేషం. అంత మందికి ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనాలంటే ఎక్కువ సమయం కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడింది. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచివుండే సమయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ వాటిని రోజుకు వెయ్యికి మాత్రమే పరిమితం చేసింది. ఆన్లైన్ విధానంలో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తుండగా, ఆఫ్‌లైన్ విధానంలో 400 టికెట్లు కేటాయిస్తున్నారు. మరో 100 టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలోనే తిరుపతి విమానాశ్రయంలో కేటాయిస్తున్నారు. దీంతో శ్రీవాణి ట్రస్ట్‌కు నెలకు అందే విరాళాలు రూ.30 కోట్లకు పరిమితమవుతుంది. నాలుగేళ్ల కాలంలో శ్రీవాణి ట్రస్టు విరాళాలు రూ. వెయ్యి కోట్లకు చేరుకున్నాయి. ♦ 2019లో రెండు నెలల కాలంలోనే 19,737 మంది భక్తుల నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.26.25 కోట్లు విరాళం లభించింది. ♦ 2020లో 49,282 మంది భక్తులు రూ.70.21 కోట్లను విరాళంగా అందించారు. ♦ 2021లో లక్షా 31వేల మంది భక్తులు రూ.176 కోట్లు విరాళంగా అందించారు. ♦ 2022లో అయితే ఏకంగా 2 లక్షల 70 వేల మంది భక్తులు రూ.282.64 కోట్లు విరాళంగా అందించారు. ♦2023లో ఇప్పటి వరకు లక్ష 58 వేల మంది భక్తులు రూ.268.35 కోట్లు విరాళంగా అందించారు. -
ఇన్‌స్టాలో డిలీట్ చేసిన కంటెంట్‌ను రీస్టోర్ చేసుకోవడానికి...
ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ నుంచి డిలీట్ చేసిన కంటెంట్‌ను తిరిగి పొందాలనుకుంటున్నారా? ఇలాంటి వారికి సులువుగా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి.. ► ఇన్‌స్టా ఓపెన్ చేసిన తరువాత ప్రొఫైల్‌పై ట్యాప్ చేయాలి. ► టాప్రైట్లోని ‘మోర్ ఆప్షన్స్’ ట్యాప్ చేయాలి. ► యాక్టివిటీ కంట్రోల్స్–ట్యాప్ ► రీసెంట్ డిలీటెడ్–ట్యాప్ ► టాప్‌లోని టైప్ ఆఫ్ కంటెంట్ (రీస్టోర్–ప్రొఫైల్ పోస్ట్,రీల్స్, వీడియోస్, స్టోరీస్) సెలెక్ట్ చేసుకోవాలి ► రీస్టోర్ చేయాలనుకున్నదానిపై ట్యాప్ చేయాలి. ► టాప్ రైట్‌లోని మోర్ ఆప్షన్–ట్యాప్ ► రీస్టోర్ టు ప్రొఫైల్ లేదా రీస్టోర్ టు రీస్టోర్ కంటెంట్ ట్యాప్ చేయాలి. (క్లిక్ చేయండి: ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్‌లోకి వెళ్లి..) -
తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్ సీఎం
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు. జూన్ 7వ తేదీలోగా ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టుకు భగవంత్‌మాన్ సర్కార్ గురువారం నివేదించింది. భవిష్యత్తులో మళ్లీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంపైనా ఎలాంటి ఆలోచనలుచేయడం లేదని కోర్టుకు తెలిపింది. సుమారు 400 మందికి పైగా వీఐపీలకు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడం, ఆ మర్నాడే మూసేవాలా దారుణ హత్య కు గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో పాటు వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఈ నేపథ్యంలోనే సీఎం భగవంత్ మాన్, పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం! -
వాట్సాప్ డేటాను కొత్త ఫోన్ లో తిరిగి పొందండిలా?
ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది అంటే అర్దం చేసుకోవచ్చు దానికి ఎంత అధరణ ఉంది అనేది. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ ఉంటుంది. దీని ద్వారా చాటింగ్, వీడియో, ఆడియో, పీడీఎఫ్ లాంటి ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి డేటా షేర్ చేసుకోవడానికి ప్రధాన సాధనంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైన మొబైల్ ఫోన్/ ఎవరైనా తస్కరించినప్పుడు అందులోని విలువైన డేటా పోతుంది. ఒకవేల మీ మొబైల్ ఇతరులకు చిక్కిన వాట్సాప్ ను ఆక్సెస్ చేయకుండా ఉండటానికి టూ-స్టెప్-వెరీఫికేషన్ ఆన్ చేసుకోవాలి. దీని వల్ల వారు మన డేటాను తస్కరించలేరు. ఒకవేల మనం డేటాను తిరిగి వేరే మొబైల్ లో లేదా పాత ఫోన్ లో ఉన్న డేటా కొత్త ఫోన్ లో ఉన్న డేటాను తిరిగి పొందలన్న కచ్చితంగా బ్యాకప్ చేసుకోవాలి. తద్వారా పోయిన మొబైల్ ఉన్న డేటాను తిరిగి పొందలన్న, మీరు కొత్త ఫోన్‌కు మారిన మీ డేటాను పునరుద్ధరించవచ్చు. వాట్సాప్ డేటా బ్యాకప్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి మీ ఫోన్లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి. సెట్టింగ్స్‌లోని ‘చాట్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆపై ‘చాట్ బ్యాకప్’ తెరవండి. గూగుల్ డ్రైవ్ లో మీ చాటింగ్ మొత్తాన్ని బ్యాకప్ చేయడానికి ‘చాట్ బ్యాకప్’ ఆప్షన్ మీకు అనుమతిస్తుంది. రోజు, వారానికి, నెలకు ఒకసారి బ్యాకప్ చేసే అవకాశం ఉంటుంది. వారానికొకసారి చాట్ బ్యాకప్ చేయాలనుకుంటే ‘వీక్లీ’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వై-ఫై, సెల్యులార్ ద్వారా బ్యాకప్ చేసుకోవచ్చు. వీడియోలను కూడా బ్యాకప్ చేయాలనుకుంటే ‘ఇంక్లూడ్ వీడియోస్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. గూగుల్ డ్రైవ్ సెట్టింగులన్నింటినీ పూర్తి చేశాక తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న ‘బ్యాకప్’ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో బ్యాకప్ అవుతుంది. కొత్త ఫోన్లో వాట్సప్ చాట్ బ్యాకప్ తిరిగి పొందడం ఎలా? వాట్సాప్ యాప్ కొత్త వెర్షన్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత, మీ మొబైల్లో కాంటాక్ట్స్, ఫోటోలు, మీడియాలు, ఫైల్స్‌ను యాక్సెస్ చేయడానికి వాట్సాప్‌కు అనుమతివ్వాలి. ఇప్పుడు ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి నెంబర్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. ఆ తర్వాత మీకు ఫోన్లో 6-అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను మెసేజ్ ద్వారా వచ్చిన వెంటనే అది ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ పూర్తవుతుంది. మీ వాట్సాప్ నెంబర్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత, ‘రీస్టోర్ బ్యాకప్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు గూగుల్ క్లౌడ్‌లోని ఉన్న మీ వాట్సాప్ డేటా పునరుద్ధరించబడతాయి. మీ పాత ఫోన్లో ఏదైతే గూగుల్ అకౌంట్ వాడారో అదే అకౌంట్‌తో కొత్త ఫోన్లో కూడా సైన్ ఇన్ అవ్వాలి. డేటా రీస్టోర్ అయిన తర్వాత ‘నెక్ట్స్’పై క్లిక్ చేయండి. ఇప్పుడు ‘ప్రొఫైల్ ఇన్ఫో’ విండోలో మీ పేరును టైప్ చేయండి. మీ పాత వాట్సాప్ లో ఉన్న డేటాను బ్యాకప్ పూర్తి కావడానికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది. మీ అన్ని పాత మెసేజెస్ పునరుద్ధరించబడతాయి. చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా విద్యారణ్యపురి: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్)ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కువద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. లింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు ఉద్యోగులకు ఒక సామాజిక భద్రతగా పాతపెన్షన్ విధానం ఉండేదన్నారు.అయితే నూతన పెన్షన్ విధానం (సీపీఎస్)తో ఉద్యోగ విరమణ పొందిన కుటుంబానికి సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. దేశంలో మిగులు బడ్జెట్ కలిగిన ధనిక రాష్ట్రంగా చెపుతున్న తెలంగాణలో ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు సంఘటితంగా పోరాడుతామన్నారు. అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం గంగాధార్ మాట్లాడుతూ ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణతో ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు ఉద్యోగులు ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి మాట్లాడుతూ సీపీఎస్ విధానంలో పెన్షన్ ,గ్రాట్యూటీ, జీపీఎఫ్ వంటివి నష్టపోవాల్సి వస్తుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి వెంకటరెడ్డి , టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి రాంచందర్, జనరల్ సెక్రటరీ టి.సుధర్శనం నాయకులు జి ఉప్పలయ్య, పి.సుధర్శన్‌రెడ్డి, బి. జాన్‌నాయక్, డి. మహేందర్‌రెడ్డి, ఎ. గోవిందరావు, కె. కొమ్మాలు, డి.కుమారస్వామి, జి. శ్రీనివాస్‌రెడ్డి, బి. రాములు, జి. ఆదిరెడ్డి, జి.సురేందర్ పాల్గొన్నారు. -
మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం
కోల్‌కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారుకు మళ్లీ ప్రాణం రానుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకుంది. ఈ కారుకు 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. 1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ ఉపయోగించారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది బోస్ మేనళ్లుడు సిసిర్ బోస్. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. కట్టుదిట్టంగా ఆయన ఇంటిచుట్టు బ్రిటీష్ సేనలు, నిఘా అధికారులు ఉన్నప్పటికీ బోస్ వారు కళ్లుగప్పి తప్పించుకున్నారు. అందుకే ఇది 'గ్రేట్ ఎస్కేప్'గా నిలిచిపోయింది. ఆ కారును ప్రస్తుతం నేతాజీ ఇంటిలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దాల గదిలో ఉంచుతున్నారు. ఆయన ఇళ్లు ప్రస్తుతం ఎన్ఆర్బీగా మారిన సంగతి తెలిసిందే. దీని చైర్ పర్సన్ కృష్ణ బోస్ ఇటీవల జర్మనీకి చెందిన ఆడి కంపెనీని సంప్రదించి ఆ కారుకు తిరిగి ప్రాణంపోయాలని చెప్పారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. వింటేజ్ కార్ల నిపుణుడు పల్లాబ్ రాయ్ సమక్షంలో ఈ కారు తిరిగి రూపుదిద్దుకోనుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్‌నాటికి పూర్తి అవనున్నట్లు ఎన్ఆర్ బీ చైర్ పర్సన్ కృష్ణ బోస్ మీడియాతో చెప్పారు. కాగా, చరిత్రలో నిలిచిపోయిన ఈ కారు నెంబర్ బీఎల్ఏ 7169. ఈ కారు ద్వారా తప్పించుకోగలిగిన బోస్ ఆ వెంటనే అఫ్గనిస్థాన్ నుంచి వయా కాబూల్, మాస్కో ద్వారా జర్మనీ చేరుకున్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
భువనగిరి : సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముల కమలాకర్ ప్రభుత్వ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని అ సంఘం డివిజన్ స్థాయి ప్రమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందడి ఉపేందర్‌రెడ్డి, యూజీఎఫ్ జిల్లా బాధ్యులు ముక్కెర్లు యాదయ్య, సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు అడెపు జానయ్య, టీపీయూఎస్ మండల అధ్యక్షుడు పాశం కృష్ణముర్తి, ప్రధాన కార్యదర్శి మల్లేష్, డీటీఎఫ్ మండల బాధ్యులు రవీందర్‌రెడ్డి, అమ్జద్, రవీందర్, కలీమోద్దీన్, కృష్ణ, అంజన్, వెంకట్‌రెడ్డి, సైదులు, యాదయ్య, మహేష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలి
జీఎం కార్యాలయం ఎదుట డిపెండెంట్ల ధర్నా కోల్‌బెల్ట్(వరంగల్) : సింగరేణిలో సర్వీసు నిబంధనలు లేకుండా వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణియన్ సన్స్ అసోసియేషన్(ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించా రు. అనంతరం సింగరేణి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం, సార్వత్రిక ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని ఆరోపించారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, నూతన గనులు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేసిన కేసీఆర్ కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. వారసత్వ ఉద్యోగాల సాధనకు చేపట్టే ఉద్యమంలో తమ పార్టీ పాలుపంచుకుంటుందని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ నాయకులు మెండే కృష్ణకుమార్, సిద్ధిక్ షేక్, కిషోర్‌కుమార్, రాజ్‌కుమార్, వినోద్, రామారావు, శివ, ప్రకాశ్, నరేష్, శ్రీధర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
గాలివానపై మంత్రి, మేయర్ సమీక్ష
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం నగరంలో బీభత్సం సృష్టించిన గాలిదుమారంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ సమీక్షించారు. శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలో వారు ఇరువురు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గాలి తీవ్రతకు జీహెచ్ఎంసీ పరిధిలోని 600 కరెంటు స్తంభాల్లో 300 నేలకూలాయని వారు తెలిపారు. వీటితోపాటు భారీ హోర్డింగులు లెక్కలేనన్ని పడిపోయాయన్నారు. నగరంలో 245 వరకు ఉన్న 11కేవీ ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. రాత్రి 1.45 గంటల కల్లా 205 ఫీడర్లలో అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలిగారని చెప్పారు. మొత్తం 1500 మంది సిబ్బంది, అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారన్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3గంటల వరకు తాను, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పర్యవేక్షించారని చెప్పారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వాటిని కూడా అధికారులు ముమ్మరం చేశారని తెలిపారు. అయితే, నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగులకు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను మాత్రమే తట్టుకునేట్లు ఏర్పాటు చేశారని, కానీ, 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయటంతో తట్టుకోలేక అవి పడిపోయాయని వారు వివరించారు. గాలి వాన ఆగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించటంతో చాలా వరకు సమస్యలను దూరం చేయగలిగామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. -
హైదరాబాద్-విజయవాడ-విశాఖ రైళ్ల పునరుద్ధరణ
భారీ వర్షాలకు విజయవాడ డివిజన్లో ట్రాక్‌పైకి వరద నీరు చేరడంతో రద్దు చేసిన రైళ్లను పునురుద్ధరించారు. విజయవాడ-విశాఖపట్నం సెక్షన్ల మధ్య దెబ్బతిన్న ట్రాక్‌ను సోమవారం సాయంత్రానికి సిద్ధం చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన, దారి మళ్లించిన కొన్ని రైళ్లను మళ్లీ యధాతథంగా విజయవాడ-విశాఖపట్నం మార్గంలో నడపనున్నారు. వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం జన్మభూమి రాత్రి 7:10 గంటలకు బయల్దేరనుంది. ఆదివారం బయల్దేరాల్సిన నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, అలప్పూజ-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రమ్-గువహటి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-హౌరా ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులను మళ్లీ పునరుద్ధరించారు.