మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం
కోల్కతా: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన కారుకు మళ్లీ ప్రాణం రానుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకుంది. ఈ కారుకు 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. 1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ ఉపయోగించారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి.
దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది బోస్ మేనళ్లుడు సిసిర్ బోస్. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. కట్టుదిట్టంగా ఆయన ఇంటిచుట్టు బ్రిటీష్ సేనలు, నిఘా అధికారులు ఉన్నప్పటికీ బోస్ వారు కళ్లుగప్పి తప్పించుకున్నారు. అందుకే ఇది 'గ్రేట్ ఎస్కేప్'గా నిలిచిపోయింది. ఆ కారును ప్రస్తుతం నేతాజీ ఇంటిలోని గ్రౌండ్ఫ్లోర్లో అద్దాల గదిలో ఉంచుతున్నారు. ఆయన ఇళ్లు ప్రస్తుతం ఎన్ఆర్బీగా మారిన సంగతి తెలిసిందే.
దీని చైర్ పర్సన్ కృష్ణ బోస్ ఇటీవల జర్మనీకి చెందిన ఆడి కంపెనీని సంప్రదించి ఆ కారుకు తిరిగి ప్రాణంపోయాలని చెప్పారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. వింటేజ్ కార్ల నిపుణుడు పల్లాబ్ రాయ్ సమక్షంలో ఈ కారు తిరిగి రూపుదిద్దుకోనుంది. ఇది ఈ ఏడాది డిసెంబర్నాటికి పూర్తి అవనున్నట్లు ఎన్ఆర్ బీ చైర్ పర్సన్ కృష్ణ బోస్ మీడియాతో చెప్పారు. కాగా, చరిత్రలో నిలిచిపోయిన ఈ కారు నెంబర్ బీఎల్ఏ 7169. ఈ కారు ద్వారా తప్పించుకోగలిగిన బోస్ ఆ వెంటనే అఫ్గనిస్థాన్ నుంచి వయా కాబూల్, మాస్కో ద్వారా జర్మనీ చేరుకున్నారు.