మహనీయుడి కారుకి ప్రాణం పోశారు
కోల్‌కతా: మహనీయుడి కారు మళ్లీ ప్రాణం పోసుకుంది. స్వాంతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్(నేతాజీ) నడిపిన కారు మరోసారి రోడ్డు ఎక్కేందుకు సిద్ధమైంది. జనవరి 18న కోల్‌కతాలోని నేతాజీ భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ కారు ప్రారంభం కానుంది. ఈ కారులో ప్రయాణించే భాగ్యం కూడా తొలిసారి రాష్ట్రపతి ప్రణబ్‌కు దక్కనుంది. దాదాపు 80 ఏళ్ల తర్వాత ఇది ఊపిరి పీల్చనుంది. చాలా ఏళ్లుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి మనుగడలోకి తెచ్చేందుకు జర్మన్ ఆడి కారు సంస్థ అధికారులతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో(ఎన్ఆర్ బీ) ఒప్పందం చేసుకున్న మేరకు ఈ కారు సిద్ధమైంది.
చదవండి.. (మహనీయుడి కారుకి మళ్లీ ప్రాణం)
1937లో జర్మనీలోని వాండరర్ సెడాన్ కంపెనీ ఈ కారును తయారు చేయగా దానిని సుభాష్ చంద్రబోస్ సోదరుడు తెప్పించారు. బోస్ ఈ కారును ఉపయోగించేవారు. స్వాతంత్ర్య పోరాటం జరిగే రోజుల్లో ఆయనను ఓసారి బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. దీంతో జనవరి 16, 1941న వాండరర్లో కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి బిహార్‌లోని గోమో ప్రాంతానికి(ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) బోస్ పారిపోయారు. అక్కడి నుంచి జర్మనీకి వెళ్లారు. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. అప్పటి నుంచి గొప్ప జ్ఞాపికగా ఉంటున్న బోస్ కారు చివరకు కదలనుంది.