మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా..? 2020లో 15 ప్రధాన ఐపీవోలకు గాను 14 కంపెనీల స్టాక్స్ ఇప్పుడు వాటి ఇష్యూ ధరకు పైనే ట్రేడవుతున్నాయి. వీటిల్లో చాలా కంపెనీల రాబడులు 200 శాతానికంటే ఎక్కువే ఉన్నాయి. కొన్ని అయితే ఇప్పటికే 400 శాతం రాబడులను కూడా ఇచ్చాయి. 11 స్టాక్స్ లిస్టింగ్ రోజు నుంచే లాభాలతో మొదలు పెట్టగా.. 6 స్టాక్స్ లిస్టింగ్ రోజే 70 శాతానికి పైగా లాభాన్నిచ్చాయి. ఈ గణాంకాలను చూసి ప్రతీ ఐపీవోను ఆకర్షణీయమైనదిగా భావించడానికి లేదు. ఐపీవోల్లో మీరు చేసే పెట్టుబడులు లాభాలు పంచి పెట్టాలంటే.. ఇన్వెస్టర్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో మొదటిసారి లిస్ట్ అయ్యేందుకు వీలు కల్పించేదే ఐపీవో. మార్కెట్లలో లిస్ట్ అయిన తర్వాత ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక గణాంకాలను వెల్లడించాల్సి ఉంటుంది. కానీ, అదే కంపెనీకి సంబంధించిన సమాచారం లిస్టింగ్‌కు ముందు సాధారణంగా బయటకు తెలిసే అవకాశం లేదు. అందుకే ఐపీవోలకు వచ్చే కంపెనీలు ఆర్థిక గణాంకాలను డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌లో (డీహెచ్‌ఆర్‌పీ)లో ఇవ్వడం తప్పనిసరి. కానీ, వీటిని గుడ్డిగా నమ్మడానికి లేదు.
ఎందుకంటే కంపెనీలు మార్కెట్ల నుంచి అనుకున్న విధంగా నిధులు సమీకరించేందుకు అనుకూలమైన నివేదికలను రూపొందించే అవకాశం లేకపోలేదు. నిష్పాక్షికంగా వీటిని రూపొందించారని భావించలేము. కనుక ఐపీవోకు దరఖాస్తు చేసుకునే ముందు కంపెనీకి సంబంధించి విస్తృతమైన పరిశోధన చేసి, వీలైనంత సమాచారాన్ని రాబట్టుకోవాలి. ప్రమోటర్ల చరిత్ర, వారిపై ఏవైనా నేరపూరిత అభియోగాలు/ఆరోపణలు ఉన్నాయా?, ఆర్థిక పరిస్థితులు, కంపెనీకి పోటీదారులు, మీడియాలో వాటికి వచ్చిన కవరేజీ, కంపెనీ పనిచేస్తున్న రంగం విస్తరించడానికి అవకాశం ఉందా తదితర సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఐపీవోలో మంచి రాబడులను సంపాదించుకోవాలని భావిస్తే ఆయా కంపెనీకి సంబంధించి వీలైనంత సమాచారాన్ని తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.
కంపెనీ వ్యాల్యూయేషన్స్..
ఐపీవోలో తమకు సెక్యూరిటీల కేటాయింపులపైనే ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది. కానీ, చాలా మంది ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు, ఐపీవోలో స్టాక్స్ వ్యాల్యూయేషన్ల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించారు. అయితే, ఐపీవోకు వచ్చే కంపెనీ మూలాలపై లోతైన పరిశోధనకు.. డీఆర్‌హెచ్‌పీలో ఇచ్చిన వివరాలు మినహా అదనపు వివరాలు లభించడం కష్టమైన పనే. సాధారణంగా ఐపీవోకు వచ్చే కంపెనీలు అధిక ధరలకు స్టాక్స్‌ను ఆఫర్ చేస్తుంటాయి. కనుక ఆయా కంపెనీ పనిచేస్తున్న రంగంలోని పోటీ కంపెనీల వ్యాల్యూయేషన్ల్లతో పోల్చి చూడొచ్చు. పోటీ సంస్థల వ్యాల్యూయేషన్లు లేదా ఆయా రంగాల్లోని కంపెనీల వ్యాల్యూయేషన్ల ఆధారంగా నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది.
ఇన్‌స్టిట్యూషన్ల భాగస్వామ్యం..
ఐపీవోల్లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (క్యూఐబీ/అర్హత కలిగిన సంస్థాగత మదుపుదారులు) కూడా పాలుపంచుకుంటుంటారు. సెబీ వద్ద నమోదైన ఫైనాన్షియల్ ఇన్‌నిస్టిట్యూషన్స్, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) క్యూఐబీ విభాగం కిందకు వస్తాయి. ఇవి సాధారణంగా ఇతర ఇన్వెస్టర్ల తరఫున ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కనుక ఇన్వెస్ట్ చేసే ముందు తగినంత పరిశోధన, అధ్యయనం తప్పక చేస్తాయి. క్యూఐబీలు ఆసక్తిగా ఒక ఐపీవోలో పాల్గొంటున్నారంటే.. ఆ కంపెనీ భవిష్యత్తులో మంచి పనితీరు చూపిస్తుందని ఎక్కువ మంది బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తుంటారు. అయితే, నేటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ క్యూఐబీల భాగస్వామ్యాన్నే ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఒక్కోసారి క్యూఐబీలు సైతం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం
లేకపోలేదు.
డీఆర్‌హెచ్‌పీ చదవాలి
ఐపీవోకు వచ్చే ప్రతీ కంపెనీ కూడా తమ వ్యాపార కార్యకలాపాలు, ఆదాయాలు, ఆస్తులు, అప్పులు, మార్కెట్ అవకాశాలపై సమగ్రమైన వివరాలను డీఆర్‌హెచ్‌పీలో అందుబాటులో ఉంచడం తప్పనిసరి. అంతేకాదు, ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ఎందుకు వినియోగించేదీ తెలియజేయాలి. అందుకే ఇన్వెస్టర్లు తాము ఆసక్తిగా ఉన్న ఐపీవోలకు సంబంధించి డీఆర్‌హెచ్‌పీని సమగ్రంగా చదవాలి. కొన్ని కంపెనీలు డీఆర్‌హెచ్‌పీని తమకు అనుకూలంగా రూపొందించే అవకాశాల్లేకపోలేదు. కానీ, వివరాలను విశ్లేషణా దృష్టితో చూస్తే తప్పక ఒక అవగాహనకు రావచ్చు. అప్పటి వరకు కంపెనీ పనితీరు ఎలా ఉన్నదీ చూడాలి. అలాగే, ఐపీవో రూపంలో సమీకరించే నిధులను ఎందుకు వినియోగిస్తుందన్నది గమనించాలి. కంపెనీ వ్యాపార విస్తరణ, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై వెచ్చించేట్టు అయితే భవిష్యత్తులో ఆ కంపెనీ మరింతగా వృద్ధి సాధిస్తుందన్న దానికి సంకేతాలుగా చూడొ చ్చు. ఒకవేళ ఐపీవో నిధులతో రుణబారం తీర్చుకోవాలని భావిస్తే.. నిజానికి ఆ కంపెనీకి ఉన్న లయబులిటీస్ (అప్పులు) ఏ
మేరకు అన్నది చూడాల్సి ఉంటుంది.
టెక్నాలజీ వినియోగం
ఒక ఐపీవోపై నిర్ణయం తీసుకోవాలంటే చూడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా ఈ పని చేయాలి. నేడు పెట్టుబడుల సిఫారసులు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఒక బిలియన్ కంటే ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించి ఐపీవోపై సలహా సేవలు అందిస్తున్నాయి. కావాలంటే వాటి సాయాన్ని తీసుకోవచ్చు.
జ్యోతిరాయ్, డీవీపీ–ఈక్విటీ స్ట్రాటజిస్ట్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్
Comments
Please login to add a commentAdd a comment