వారాంతంలో లాభాల వద్ద ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ప్రారంభంలోనే శుభారంభం పలికాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 954.15 పాయింట్ల భారీ లాభంతో 68435.34 వద్ద, నిఫ్టీ 334.10 పాయింట్ల లాభంతో 20602.00 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండూ కూడా భారీగా దూసుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది.
అమెరికా మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడయ్యాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే సంకేతాలు అక్కడి సూచీలకు కలిసొచ్చాయి. ఆసియా పసిఫిక్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.1,589 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు సైతం రూ.1,448 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలను భాజపా గెలవడం సూచీలపై సానుకూల ప్రభావం చూపుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ నిర్ణయాలు ఈనెల 8న వెలువడతాయి. వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పు చేయకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నప్పటికీ.. ద్రవ్య నిర్వహణ, రుణాల వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యలు కీలకం అవుతాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతి ఎయిర్టెల్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు ఉన్నాయి. బ్రిటానియా, నెస్లే, డెల్టా కార్పొరేషన్ లిమిటెడ్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అపోలో హాస్పిటల్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ వంటి కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఆటోమొబైల్ కంపెనీలు కూడా ;లాభాల్లో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment