సాక్షి, ముంబై:ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థ టయోటా భారీ ప్రణాళికలే వేస్తోంది. 2026 నాటికి 10 కొత్త ఈబీ మోడళ్లను విడుదల చేయనుంది. అలాగే 2030 నాటికి 3.5 మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మేరకు టయోటా మోటార్ కొత్త ప్రెసిడెంట్ సీఈవో కోజీ సాటో తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ హిరోకి నకాజిమా మాట్లాడుతూ, 2026 నాటికి కంపెనీ 10 కొత్త ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను లాంచ్ చేయనుందనీ, తద్వారా ఏటా దాదాపు 1.5 మిలియన్ వాహనాలను విక్రయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.
టయోటా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-వాహన పరిశ్రమలో ఆకట్టుకోలేకపోయింది.ముఖ్యంగా టెస్లా ,చైనా బీవైడీతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో వెనుకబడి ఉంది. టెస్లా, బీవైడీ వేగంగా విస్తరిస్తున్న ఈ-మార్కెట్‌లో దూసుకు పోతుండటంతో టయోటా కొత్త మేనేజ్‌మెంట్ ఈ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయాలనే టాస్క్‌లో పడిందని నిక్కీ ఆసియా నివేదించింది.
దీనికితోడు గత సంవత్సరం కంపెనీ తొలి భారీ-ఉత్పత్తి బ్యాటరీ-ఆధారిత మోడల్, bz4X రీకాల్ కావడం భారీగా దెబ్బతీసింది. ఎస్ అండ్‌పీ గ్లోబల్ మొబిలిటీ డేటా ప్రకారం, టయోటా 2022లో 21,650 బ్యాటరీతో నడిచే వాహనాలను విక్రయించింది.ఇది కేవలం 0.3 శాతం వాటాను మాత్రమే. అత్యధికంగా అమ్ముడైన టెస్లా 1.27 మిలియన్ యూనిట్లను, బీవైడీ 810,600 వాహనాలను సేల్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment