
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రతిపాదించిన కేవైసీ ఆధారిత కాలర్ నేమ్ డిస్‌ప్లే విధానంతో తమకు పోటీ ఉండబోదని కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ సీఈవో అలాన్ మామెడీ తెలిపారు. తాము కేవలం కాలర్ గుర్తింపు సేవలే అందించడానికి పరిమితం కాకుండా తమ టెక్నాలజీ, డేటాతో మరెన్నో సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కమ్యూనికేషన్స్‌ను సురక్షితమైనవిగా చేసే దిశగా ట్రాయ్ తీసుకుంటున్న చర్యలను తాము స్వాగతిస్తున్నామని అలాన్ వివరించారు. ఒకవేళ ప్రతిపాదిత సర్వీసును ప్రవేశపెడితే, దాన్ని అభివృద్ధి చేసేందుకు, అమల్లోకి తెచ్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన టెలికం ఆపరేటర్లందరి సహకారం దీనికి అవసరమవుతుందని ఒక ప్రకటనలో వివరించారు.
ట్రాయ్ కసరత్తు
కనెక్షన్ తీసుకునే సమయంలో కస్టమరు ఇచ్చే వివరాల (కేవైసీ)ను ప్రాతిపదికగా తీసుకుని, కాల్ చేసేటప్పుడు సదరు యూజరు పేరు అవతలి వారి ఫోన్‌లో డిస్‌ప్లే అయ్యేలా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టడంపై ట్రాయ్ కసరత్తు చేస్తోంది. త్వరలో పరిశ్రమ వర్గాలతో దీనిపై చర్చలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ట్రూకాలర్ ఇదే తరహా సేవలు అందిస్తోంది. భారత్‌లో భారీ స్థాయిలో యూజర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రాయ్ ప్రతిపాదన .. ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్ సర్వీసుల సంస్థలకు ప్రతికూలం కాగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.