ట్విటర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో సంచలనాలు, వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్. సగానికిపైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపడం, బ్లూటిక్ ఛార్జీల వసూలు నిర్ణయాలతో మస్క్ అందరి నోళ్లలో నానుతూ వచ్చారు. తాజాగా ట్విటర్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఇంట్రస్టింగా మారింది. మస్క్ ట్విటర్ ఆస్తుల్ని మరోసారి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.
ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించే హెరిటేజ్ గ్లోబల్ పార్టనర్ సంస్థ భాగస్వామ్యంతో ఎలాన్ మస్క్ ట్విటర్ సంస్థకు చెందిన ఆస్తుల్ని 24 గంటల పాటు వేలం నిర్వహించేందుకు పెట్టారు. 24 గంటల తర్వాత వాటిని తొలగించనున్నారు.
ట్విటర్ ఆఫీస్‌లో నిరుపయోగంగా ఉన్న కిచెన్‌వేర్, వైట్‌బోర్డ్‌లు, డెస్క్‌ల వంటి సాధారణ కార్యాలయ ఫర్నిచర్ నుండి 100 కంటే ఎక్కువ కేఎన్ 95 మాస్క్‌లు, డిజైనర్ కుర్చీలు, కాఫీ మెషీన్‌లు, ఐమాక్, ఛార్జింగ్ పెట్టేందుకు వినియోగించే స్టేషనరీలు ఉన్నాయి. వీటితో పాటు ట్విటర్ పిట్ట స‍్టాచ్యూ, @ సింబల్ వంటి కంపెనీ మెమోరీస్ నిండిన ఇతర వస్తువులు సైతం ఉన్నాయి. ఆ వస్తువుల ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ ప్రారంభ ధర 25డాలర్లుగా ఉంది.
ఈ సందర్భంగా హెరిటేజ్ గ్లోబల్ పార్ట్‌నర్స్ ప్రతినిధి ఫార్చ్యూన్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ..ట్విటర్ ఆర్ధిక పరిస్థితికి ఈ వేలానికి సంబంధలేదని తెలిపారు. అయినప్పటికీ, కంపెనీలో ఖర్చుల్ని తగ్గించేందుకు మస్క్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొకటని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment