న్యూఢిల్లీ: కొద్ది వారాలుగా జోరుమీదున్న ప్రైమరీ మార్కెట్లు మరోసారి సందడి చేయనున్నాయి. గత వారం పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న డిజిటల్ సేవల సంస్థ పేటీఎమ్ షేర్ల అలాట్‌మెంట్‌ను చేపట్టడంతో గురువారం(18న) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుంది. ఇక ఈ నెలలో ఇప్పటికే 8 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకురాగా.. ఈ వారం మరో రెండు కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. తాజా జాబితాలో టార్సన్స్ ప్రొడక్ట్స్, గో ఫ్యాషన్ ఇండియా చేరాయి. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా రూ. 2,038 కోట్లను సమకూర్చుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. వివరాలు ఇవీ..
వన్97 కమ్యూనికేషన్స్
గత వారం ఐపీవో ముగించిన పేటీఎమ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మంగళవారాని(16)కల్లా షేర్ల అలాట్‌మెంట్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో షేరుకి రూ. 2,150 ధరలో ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 18,300 కోట్లు సమకూర్చుకుంది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో ఈ నెల 18న షేర్లను లిస్ట్ చేయనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ విలువ 20 బిలియన్ డాలర్లను(రూ. 1,49,248 కోట్లు) తాకే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. 2000లో ప్రారంభమైన వన్97 కమ్యూనికేషన్స్ వినియోగదారులు, వ్యాపారస్తులకు డిజిటల్ ఎకో సిస్టమ్ ద్వారా సేవలందిస్తోంది. వినియోగదారులకు పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసులందిస్తోంది.
టార్సన్స్ ప్రొడక్ట్స్‌కు..
సోమవారం(15న) ప్రారంభమైన లైఫ్ సైన్సెస్ కంపెనీ టార్సన్స్ ప్రొడక్టŠస్ పబ్లిక్ ఇష్యూ నేడు(17న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 635–662 కాగా.. రెండో రోజు మంగళవారానికల్లా 3.6 రెట్లు అధికంగా స్పందన లభించింది. కంపెనీ 1.08 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 3.88 కోట్ల షేర్లకు బిడ్స్ లభించాయి. రిటైలర్లు 4.75 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. తద్వారా రూ. 1,024 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఐపీవోలో భాగం గా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.32 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ వారాంతాన యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 306 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే.
గో ఫ్యాషన్ ఇండియా
మహిళా దుస్తుల బ్రాండ్ గో కలర్స్ మాతృ సంస్థ గో ఫ్యాషన్ ఇండియా ఐపీవో నేడు(బుధవారం) ప్రారంభమై సోమవారం(22న) ముగియనుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 655–690కాగా.. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 456 కోట్లు సమకూర్చుకుంది. 33 సంస్థలకు రూ. 690 ధరలో 66 లక్షలకుపైగా షేర్లను కేటాయించింది. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 1,014 కోట్లు సమీకరించే సన్నాహాల్లో కంపెనీ ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 125 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో నిధుల్లో కొంతమేర 120 ప్రత్యేక ఔట్‌లెట్ల ఏర్పాటుకు వెచ్చించనుంది.
ఈ ఏడాది 49 కంపెనీలు
నవంబర్‌లో ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోలను చేపట్టాయి. జాబితాలో వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), ఎఫ్‌ఎస్‌ఎన్ ఈకామర్స్ వెంచర్స్(నైకా), పీబీ ఫిన్‌టెక్(పాలసీబజార్), ఫినో పేమెంట్స్ బ్యాంక్, లేటెంట్ వ్యూ అనలిటిక్స్, సఫైర్ ఫుడ్స్ ఇండియా, ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్, సిగాచీ ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కేలండర్ ఏడాది(2021)లో ఇప్పటివరకూ 49 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 1.01 లక్షల కోట్లను సమకూర్చుకోవడం విశేషం! ఈ స్థాయిలో ఇంతక్రితం అంటే 2017లో పబ్లిక్ ఇష్యూల ద్వారా 36 కంపెనీలు రూ. 67,147 కోట్లను సమకూర్చుకున్నాయి.
చదవండి: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా ? క్యూ 3లో లిస్టింగ్ కంపెనీల రిజల్ట్స్
Comments
Please login to add a commentAdd a comment