ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ఇంధన ధరలు పెరిగిపోవడం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కోవిడ్-19 వంటి కారణాలతో వచ్చే ఏడాది ఆర్ధిక మాంద్యం అతలా కుతలం చేస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేలో 63 శాతం మంది ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా చిన్నా చితకా,పెద్ద, మధ్య తరగతి ఇలా కంపెనీ ఏదైనా సరే ఎంప్లయూస్‌ను వదిలించుకునేందుకు రెడీ అవుతున్నాయి.అదే సమయంలో వందలాది కంపెనీలు ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ నిర్ణయాలు తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది.
సాఫ్ట్‌వేర్ మొదలు ఈ కామర్స్ కంపెనీల దాకా..చిన్నా పెద్దా అనే తేడాలేదు. అన్నీ కంపెనీలదీ అదే బాట. అదే మాట. ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకే నిర్ణయించుకుంటున్నాయి. మొన్న ట్విటర్ ఆ తర్వాత మెటా, ఇప్పుడు జొమాటో, అమెజాన్ ఇలా వరుసపెట్టి ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.
అయితే ఈ నేపథ్యంలో యూకేకి చెందిన కంపెనీలు వేతనాల్ని తగ్గించకుండా ఉద్యోగులందరు వారానికి నాలుగురోజులు పనిచేసేందుకు అంగీకరిస్తున్నాయి. 100 కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న 2,600 మంది పనిదినాల్ని తగ్గించాయి. రానున్న రోజుల్లో యూకే దేశానికి చెందిన మొత్తం కంపెనీలు ఈ తరహా పని విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ హెచ్‌ఆర్ విభాగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొడక్టివిటీ పెరుగుతోంది
5 రోజుల పనిదినాల్ని 4రోజులకు తగ్గించడం వల్ల సంస్థల్లో సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే పనిని తక్కువ గంటల్లో పూర్తి చేసేలా సంస్థల్ని ప్రోత్సహిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ పని విధానాన్ని ముందుగా అమలు చేసిన సంస్థల్లో ఉద్యోగులు రిజైన్ చేయడం కానీ లేదంటే ఆఫర్ పేరతో మరో సంస్థలో చేరే సాహాసం చేయరని తెలుస్తోంది.
కొత్త వర్కింగ్ ప్యాటర్న్‌పై కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్, బోస్టన్ యూనివర్సిటీల సైంటిస్ట్‌లు పరిశోధనలు నిర్వహించారు. వారి రీసెర్చ్‌లో సైతం ఆయా సంస్థలు 88 శాతం వారానికి 4రోజుల పని కారణంగా రోజూవారీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment