న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేజ్... దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరతీయనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పనున్నారు. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయి’ అని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.
ఎలా పనిచేస్తుందంటే...
వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్‌స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించి, డిస్‌ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్ డెవలపర్లు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది.
మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాయమైపోయిన పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు.. మళ్లీ కొత్త రూట్‌లో ప్రజల ముందుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. సందు చివర కిరాణా షాపులు, చిన్నా చితకా టీ కొట్లు, పాన్ షాపుల్లో కూడా పబ్లిక్ వైఫై బూత్‌లు త్వరలో దర్శనమివ్వనున్నాయి. గతంలో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) స్థానంలో ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)లు కొలువుదీరనున్నాయి. మొబైల్ డేటాతో పనిలేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... ఎంత కావాలంటే అంత డేటాను లోడ్ చేసుకొని, ఎంచక్కా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టేయొచ్చన్నమాట!!
దేశంలో లక్షలాది వైఫై హాట్‌స్పాట్‌లను సృష్టించేందుకు ఈ ‘వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కంటెంట్ పంపిణీలో సమానావకాశాలను అందించడంతో పాటు చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్ని కనెక్టివిటీ సేవల్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్)గా చెప్పుకోవచ్చు.
– ఆర్‌ఎస్ శర్మ, ట్రాయ్ మాజీ చైర్మన్
లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు వీలు కల్పించే ఈ కీలక చర్యకు మేం ముందునుంచీ మద్దతిస్తున్నాం. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తికి ఇది ఎంతగానో చేదోడు అందిస్తుంది. ప్రజలను డిజిటల్ పౌరులుగా మార్చేస్తుంది. అదే సమయంలో వ్యాపారాభివృద్ధితో పాటు కిరాణా స్టోర్లు, టీ షాపులు వంటి చిన్న స్థాయి వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మొత్తంమీద చూస్తే సామాజిక–ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ దీని ద్వారా సాకారమవుతుంది.
– టీవీ రామచంద్రన్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ప్రెసిడెంట్
కొత్త కొలువులు పెరుగుతాయ్...
‘వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో స్థిరమైన, మరింత సమర్థవంతమైన హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను కోరుకుంటున్న యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. 4జీ మొబైల్ కవరేజీ లేని ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. పబ్లిక్ వైఫైను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ అవసరాలను తీర్చగలం’ అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment