
న్యూఢిల్లీ: నిరుద్యోగం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు)లో నిరుద్యోగ రేటు 7.2 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిరుద్యోగం 9.8 శాతంగా ఉండడం గమనార్హం. నాడు కరోనా తీవ్రత అధికంగా ఉండడం ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపించింది. 15 ఏళ్లు నిండి, అర్హతలుండీ పనిలేని వారిని ఈ గణాంకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడడం, క్రమంగా పురోగతి చూపిస్తున్న క్రమంలో నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తోంది. 16వ పీరియాడిక్ లేబర్ సర్వే వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) గురువారం విడుదల చేసింది.
► జూలై–సెప్టెంబర్ మధ్య పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 7.6 శాతంగా ఉంది.
► పట్టణ మహిళల్లో ఇది 9.4 శాతంగా ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో పట్టణాల్లో మహిళా నిరుద్యోగ రేటు 11.6 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 9.5 శాతంగా ఉంది.
► ఇక పట్టణ ప్రాంతాల్లోని పురుషుల్లో నిరుద్యోగం 6.6 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 9.3 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ఇది 7.1 శాతంగా ఉంది.
► 2017 ఏప్రిల్ నుంచి ఎన్‌ఎస్‌వో ప్రతి మూడు నెలల కాలానికి సంబంధించి నిరుద్యోగం వివరాలను విడుదల చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment