న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ రూ. 20,000 కోట్ల భారీ ఫాలో ఆన్ ఇష్యూకు (ఎఫ్‌పీవో) వస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ షాకిచ్చింది. అదానీ గ్రూప్ .. అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనితో బుధవారం అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది.
వివరాల్లోకి వెడితే.. అదానీ గ్రూప్ దశాబ్దాలుగా అకౌంటింగ్ మోసాలు, షేర్ల రేట్లకు సంబంధించి మోసాలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్ ఒక నివేదికలో పేర్కొంది. కరీబియన్ దేశాలు మొదలుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదానీ కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. లిస్టెడ్ కంపెనీల నిధులను దారి మళ్లించేందుకు, మనీ లాండరింగ్, అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడేందుకు వీటిని ఉపయోగించారని ఆరోపించింది.
‘అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ 120 బిలియన్ డాలర్లకు పైగా సంపద సమకూర్చుకున్నారు. ఇందులో 100 బిలియన్ డాలర్లు, గ్రూప్‌లో భాగమైన ఏడు కీలకమైన లిస్టెడ్ కంపెనీల షేర్ల రేట్లు పెరగడం ద్వారా గత మూడేళ్లలోనే పోగుపడ్డాయి. ఈ వ్యవధిలో ఆయా సంస్థల షేర్లు సగటున 819 శాతం మేర ఎగిశాయి‘ అని ఒక నివేదికలో పేర్కొంది.
ఈ నివేదిక పరిశోధనలో భాగంగా అదానీ గ్రూప్‌లోని పలువురు మాజీ సీనియర్ ఉద్యోగులతో పాటు డజన్ల కొద్దీ వ్యక్తులతో మాట్లాడి, వేల కొద్దీ డాక్యుమెంట్లను సమీక్షించి, అరడజను పైగా దేశాల్లో సైట్ విజిట్లు చేశామని హిండెన్‌బర్గ్ వివరించింది. భారీ వేల్యుయేషన్లతో ట్రేడవుతున్న 7 కంపెనీల ఫండమెంటల్స్ బట్టి చూస్తే కనీసం 85 శాతం వరకు షేరు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అమెరికాలో ట్రేడయ్యే బాండ్లు, ఇతరత్రా డెరివేటివ్ సాధనాల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లో తాము షార్ట్ పొజిషన్స్ తీసుకున్నట్లు వెల్లడించింది.
అదానీ గ్రూప్ ఖండన...
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను అదానీ గ్రూప్ ఖండించింది. వాస్తవాలను తెలుసుకునేందుకు తమను సంప్రదించేందుకు ఎటువంటి కనీస ప్రయత్నమూ చేయకుండా నివేదికను విడుదల చేయడం షాక్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానాలు కూడా తోసిపుచ్చిన నిరాధార ఆరోపణలు, తప్పుడు సమాచారంతో దీన్ని రూపొందించారంటూ ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సరిగ్గా ఎఫ్‌పీవోకు సిద్ధమవుతున్న తరుణంలో దీన్ని విడుదల చేయడం వెనుక గల ఉద్దేశాలను ప్రశ్నించింది. ‘అదానీ గ్రూప్ ప్రతిష్టను, ఇష్యూను దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఇలా చేసినట్లు స్పష్టం అవుతోంది‘ అని వ్యాఖ్యానించింది. దేశీయంగా అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా పరిగణిస్తున్న ప్రతిపాదిత ఎఫ్‌పీవో జనవరి 27న ప్రారంభమై 31న ముగియనున్న సంగతి తెలిసిందే.
షేర్లకు షాక్..
హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కొన్ని బుధవారం పది శాతం వరకూ క్షీణించాయి. దీంతో ఒక దశలో అదానీ సంపద దాదాపు 6 బిలియన్ డాలర్ల మేర పడిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత షేర్లు కొంత కోలుకున్నాయి. మొత్తం మీద అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు సుమారు 9 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 6%, అదానీ టోటల్ గ్యాస్ 5.5%, అదానీ విల్మర్.. అదానీ పవర్ .. ఎన్‌డీటీవీ తలో 5%, అదానీ గ్రీన్ ఎనర్జీ 3%, ఇటీవల కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఏసీసీ కూడా 7% పైగా క్షీణించాయి.
అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ మోసాలు!
Published Thu, Jan 26 2023 4:31 AM | Last Updated on Thu, Jan 26 2023 4:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment