వరుసగా మూడో రోజు మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే టెక్నాలజీ కౌంటర్లలో తలెత్తిన భారీ అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. వెరసి డోజోన్స్ 633 పాయింట్లు(2.25%) పతనమై 27,500 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 95 పాయింట్లు(2.78%) దిగజారి 3,332 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ మరింత అధికంగా 465 పాయింట్లు(4.11%) పడిపోయి 10,848 వద్ద స్థిరపడింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే నాస్‌డాక్ ఇండెక్స్ 10 శాతం కోల్పోయింది. ఇది దిద్దుబాటు(కరెక్షన్)కు సంకేతమని సాంకేతిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థలకు కోవిడ్-19.. సవాళ్లు విసురుతుండటం, మరోపక్క డీల్ కుదుర్చుకోకుండానే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందన్న(బ్రెగ్జిట్) అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలరు ఇండెక్స్ నాలుగు వారాల గరిష్టానికి చేరగా.. ముడిచమురు ధరలు 8 శాతం పడిపోయాయి.
పతన బాటలో
ఫాంగ్(FAAMNG) స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్ ఎకానమీ కౌంటర్లలో యాపిల్ 7 శాతం పతనమైంది. దీంతో ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ విలువలో 140 బిలియన్ డాలర్లు ఆవిరైంది. 2008 అక్టోబర్ తదుపరి యాపిల్ షేరు 3 రోజుల్లోనే 14 శాతం క్షీణించింది. ఈ బాటలో ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్.. తొలిసారి ఒక్క రోజులోనే 21 శాతం కుప్పకూలింది. జనరల్ మోటార్స్ 2 బిలియన్ డాలర్లతో 11 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించడంతో టెస్లా ప్రత్యర్థి సంస్థ నికోలా కార్పొరేషన్ షేరు 41 శాతం దూసుకెళ్లింది.
ఫాంగ్ స్టాక్స్ వీక్
టెక్నాలజీ, సోషల్ మీడియా, ఈకామర్స్ దిగ్గజాలలో మైక్రోసాఫ్ట్ 5.4 శాతం, ఫేస్‌బుక్ 4 శాతం, అమెజాన్ 4.4 శాతం, గూగుల్ 3.7 శాతం, నెట్‌ఫ్లిక్స్ 1.8 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ కౌంటర్లలో బిలియన్ల డాలర్లతో పొజిషన్లు తీసుకున్నట్లు వెలువడిన అంచనాల కారణంగా సాఫ్ట్‌బ్యాంక్ షేరు సైతం 7 శాతం పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment