ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో ఓటమి తరువాత టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓడిపోయిన మరుసటి రోజే భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని మేనేజర్ బంటీ సజ్‌దేహ్ మధ్య దశాబ్ద కాలానిపైగా ఉన్న దీర్ఘకాలిక పార్టనర్‌షిప్‌ను ముగించినట్టు సమాచారం.
ఇంత సక్సెస్‌ఫుల్ భాగస్వామ్యానికి వీడ్కోలు పలకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలపై స్పష్టత లేదు కానీ కోహ్లినే సొంతంగా రూ.100కోట్ల కంపెనీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పనులను కూడా ప్రారంహించాడట.
రోహిత్ శర్మ, KL రాహుల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ లాగానే ఇపుడు కోహ్లీ, బంటీ సంబంధం కూడా ముగిసిందని ఇండస్ట్రీ మూలాన్ని ఉటంకిస్తూ క్రికెట్ నెక్స్ట్ పేర్కొంది. క్రికెట్ నెక్ట్స్ నివేదికల ప్రకారం కార్మర్ స్టోన్ వ్యవస్థాపకుడు బంటి సజ్‌దేహ్ గత పదేళ్లుగా కోహ్లి వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. ప్రధాన క్రికెట్ ఈవెంట్లలో తరచుగా అతని పక్కన ఉంటూ కోహ్లికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచాడు. ముఖ్యంగా కోహ్లి, వాణిజ్య ప్రయోజనాలు, బ్రాండ్ వాల్యూ వంటి అంశాలను బంటీ పర్యవేక్షిస్తుంటారు. పుమా సంస్థతో కోహ్లి వందకోట్ల ఒప్పందంతో పాటు అనేక కీలక ఒప్పందాలు కుదర్చడంలో బంటీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీనికి తోడు కార్నర్‌స్టోన్ అటు క్రీడాకారులు, ఇటు బాలీవుడ్ ప్రముఖుల వ్యాపార కార్యకలాపాలనుసైతం నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇకోహ్లీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుందనే విమర్శలు ఉన్న ఈ నేపథ్యంలోనే కార్నర్ స్టోన్ నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్ వంటి క్రీడాకారులు బయటికి వచ్చేశారు. పీవీ సింధు, సానియా మీర్జా, ఉమేష్ యాదవ్, కుల్దీప్ యాదవ్, యశ్ ధుల్ వంటి ప్లేయర్లు ఆ సంస్థలోనే కొనసాగుతున్నారు.
2020లో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కార్నర్‌స్టోన్‌తో భాగస్వామ్యం కలిగి, ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (DCA)ని ఏర్పాటు చేసింది. అయితే, కార్నర్‌స్టోన్‌తో క్రికెటర్ల అనుబంధం జాయింట్ వెంచర్‌తో సంబంధం లేకుండా ఉంది. బంటికి టీమ్ ఇండియాలో కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. సోహైల్ ఖాన్ మాజీ భార్య సీమా సోదరుడే బంటీ. అలాగే స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మకు బావ. అతని సోదరి కార్నర్‌స్టోన్‌లో చేరడం తోపాటు, స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది.
ఇది ఇలా ఉంటే బంటీ తన పాఠశాల విద్యను ముంబైలో పూర్తి చేశాడు. ముంబైలోని HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ఆస్ట్రేలియా బాండ్ విశ్వవిద్యాలయంలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అతను పర్సప్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో టాలెంట్ అక్విజిషన్ అడ్వైజర్‌గా తన కరియర్‌ను ప్రారంభించాడు.
Comments
Please login to add a commentAdd a comment