సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభం, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రభారీ ఊరట కల్పించిన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో టెలికాం షేర్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో లాభాల పరంగా, వినియోగదారుల పరంగా బాగా వెనుకబడిన వొడాఫోన్ ఐడియా కు మళ్లీ జీవం వచ్చినట్టైంది. ఈ కంపెనీ షేర్లు 15 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు గత 10 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ 72 శాతం పుంజుకోవడం విశేషం.
టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు బుధవారం టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినసంగతి తెలిసిందే. ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఏజీఆర్‌కు సంబంధించి ప్రస్తుతమున్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
చదవండి : టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట
కాగా ఎయిర్‌టెల్ జియో, వొడాఫోన్ ఐడియా మూడు ప్రైవేట్ రంగ సంస్థల ఉమ్మడి నికర రుణాలు రూ. 3.6 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రం , ఏజీఆర్ బకాయిల విలువ .1.6 లక్షల కోట్లు. అంటే సంస్థ మొత్తం బకాయిల్లో 84 శాతం. బ్యాంకింగ్ రంగంలో వొడాఫోన్ ఐడియాకు మొత్తం రూ . 29,000 కోట్ల రుణాలుండగా, దేశంలోని అతిపెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా రూ .11,000 కోట్లు. దీంతోపాటు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి ఇతర మధ్యతరహా బ్యాంకుల రుణాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment