ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పైనా ఆఫీసులకు వెళ్లొచ్చు కూడా. కరోనాతో కస్టమర్లలో వచ్చిన మార్పులతో నగరంలో వాక్ టు ఆఫీసు ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది.
కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. కోవిడ్‌తో వర్క్ ఫ్రం హోమ్ అలవాటైన ఉద్యోగస్తులు తిరిగి కార్యాలయానికి రావటానికి ఆసక్తి చూపించడం లేదు. గంటల కొద్ది ప్రయాణం చేస్తూ.. కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులతో ఆఫీసుకు వెళ్లేందుకు ఇష్టం పడటం లేదు. ఈ నేపథ్యంలో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు డెవలపర్లు శ్రీకారం చుట్టారు. ఆఫీసులకు చేరువలోనే గృహాలతో పాటు స్కూల్, ఆసుపత్రి, షాపింగ్ మాల్, పార్కు వంటి అన్ని రకాల వాణిజ్య ఏర్పాట్లు ఉండటం వీటి ప్రత్యేకత. దీంతో ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. పనిచేసే కార్యాలయానికి చేరుకోవడానికి అత్యధిక శాతం మంది తక్కువలో తక్కువ గంటసేపు బస్సుల్లోనో, లేదా ఇతరత్రా వ్యక్తిగత వాహనాల్లోనో గడిపేస్తున్నారు. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. దీంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్స్‌లో ఇల్లు, ఆఫీసు, మాల్, పార్కులు, స్కూల్, ఆసుపత్రి.. ఇలా సమస్త అవసరాలూ ఒకే చోట ఉంటాయి.
ఈ ప్రాజెక్ట్‌లతో వేగంగా అభివృద్ధి..
నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతుంది. ‘‘ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా మంది ఇలాంటి ఫ్లాట్లే కావాలని అడుగుతున్నారని ఫార్చూన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ సీఎండీ బీ శేషగిరిరావు చెప్పారు. అయితే ఈ వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌ల్లో కేవలం అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉంటే సరిపోదు. ఆ ప్రాంతం కూడా అభివృద్ధికి చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. అందుకే ఐటీ, బీపీఓ వంటి వాటితో గచ్చిబౌలి, మాదాపూర్‌లు ఎలా అయితే వృద్ధి చెందాయో అంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
నగరం నలువైపులా..
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాక్ టు వర్క్ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం చుట్టూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లకు మరింత ఊపొచ్చింది. ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతాలకు చుట్టూ 4 కి.మీ. పరిధిలో వాక్ టు వర్క్ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు ముందుకొస్తున్నారు. నగరంలోని మొత్తం రెండు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సిటీ నలువైపుల నుంచి వచ్చే వారు కొందరైతే, ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిపోయేవారు మరికొందరు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment