
ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ( Warren Buffett ) కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ కంపెనీ బెర్క్‌షైర్ హతావే ( Berkshire Hathaway ) ఒక ట్రిలియన్ డాలర్ల (రూ. 82 లక్షల కోట్లకుపైగా) ఆస్తులను ఆర్జించి చారిత్రక మైలురాయిని సాధించింది. సంపద సృష్టికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది.
ఇటీవల విడుదల చేసిన కంపెనీ రెండవ త్రైమాసిక డేటా ప్రకారం, బెర్క్‌షైర్ హతావే జూన్ చివరి నాటికి 1.04 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. వీటిలో దాని స్టాక్ పోర్ట్‌ఫోలియో ద్వారానే అత్యధిక సంపద ఉంది. ఇది త్రైమాసికం చివరి నాటికి 353 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. ఇందులో 178 బిలియన్ డాలర్లు ఒక్క యాపిల్ సంస్థలోనే ఉన్నాయి.
33 వేల రెట్లు పెంచిన బఫెట్
ట్రిలియన్ మైలురాయి దాటి ఆకట్టుకున్న బెర్క్‌షైర్ హతావే ఆస్తులు వారెన్ బఫెట్‌కు ముందు 1964లో 30 మిలియన్ డాలర్లు. ఈ మొత్తం 30 సంవత్సరాలలో 700 రెట్లు పెరిగి 1994లో దాదాపు 21 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అప్పటి నుంచి బెర్క్‌షైర్ ఆస్తులు మరో 48 రెట్లు పెరిగాయి. మొత్తంగా వారెన్ బఫెట్ సీఈవో ఉన్న సమయంలో కంపెనీ ఆస్తులను 33,000 రెట్లు పెంచారు.
యాపిల్ కంటే మూడింతలు
ఇటీవలి త్రైమాసికం ముగింపులో యాపిల్ కంపెనీ 335 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. ఇందులో 167 బిలియన డాలర్లు నగదు, సెక్యూరిటీలు, ఇతర రూపాల్లో ఉన్నాయి. అమెజాన్ 463 బిలియన్ డాలర్ల ఆస్తులను క్లెయిమ్ చేయగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా 200 నుంచి 400 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులను నివేదించాయి.
ఇక బెర్క్‌షైర్‌తో పోల్చదగిన మార్కెట్ విలువ కలిగిన టెస్లా జూన్ చివరి నాటికి కేవలం 91 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది. 768 బిలియన్ డాలర్ల బెర్క్‌షైర్ కంటే అధికంగా దాదాపు 1.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన ఎన్విడియా, తాజా లెక్కల ప్రకారం 44 బిలియన్ డాలర్ల ఆస్తులను మాత్రమే కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment