హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో వివిధ కారణాలతో 700 పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్లు క్రిప్టో ఎక్సే్చంజీ వజీర్‌ఎక్స్ వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం అకౌంట్లను యూజర్ల అభ్యర్ధనల మేరకు నిలిపివేసినట్లు వివరించింది. 3వ పారదర్శకత నివేదికను విడుదల చేసిన సందర్భంగా వజీర్‌ఎక్స్ ఈ విషయాలు తెలిపింది. దీని ప్రకారం సమీక్షాకాలంలో దాదాపు 1 కోటి లావాదేవీలు జరిగాయి.
ఇదే సమయంలో ఈడీ, సీబీఐ వంటి దేశీయ దర్యాప్తు సంస్థలతో పాటు ఎఫ్‌బీఐ వంటి విదేశీ ఏజెన్సీల నుండి 828 అభ్యర్ధనలు వచ్చాయి. వీటిలో 764 దేశీ దర్యాప్తు సంస్థల నుంచి రాగా మిగతావి విదేశీ ఏజెన్సీల నుంచి వచ్చినట్లు వివరించింది. ఎక్కువగా అక్రమంగా నిధుల బదలాయింపులు, క్రిప్టో స్కాములు, చీటింగ్, ఫోర్జరీ లాంటి నేరాలపై ఫిర్యాదులు అందినట్లు వజీర్‌ఎక్స్ తెలిపింది. క్రిప్టో కరెన్సీలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, అలాగే మోసాలను నివారించేందుకు నియంత్రణ సంస్థలకు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని వజీర్‌ఎక్స్ సీఈవో నిశ్చల్ శెట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment