కరోనా మహమ్మారి తర్వాత తమ డబ్బును ఖర్చు చేయకుండా, మంచి రాబడి ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలని తెగ ఆలోచిస్తుంటారు. ఈ మధ్య పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్ ఒక మంచి ఎంపిక అని నిపుణులు ఎక్కువగా చెబుతున్నారు. ఇందులో రాబడి కూడా స్థిరంగా వస్తుంది. అలాగే, స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలియని వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకే, పెట్టుబడి పెట్టే ముందు మ్యూచువల్ ఫండ్ గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?
మ్యూచువల్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి స్టాక్లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి మొదలైన వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన పెట్టుబడి పథకం. ఫండ్ మేనేజర్లు అని పిలిచే ప్రొఫెషనల్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తారు. మీ తరుపున మార్కెట్ గురించి మంచి జ్ఞానం ఉన్న ఆర్ధిక నిపుణులు మనకు లాభాలను తెచ్చిపెట్టే ఫండ్‌లో మీ డబ్బును పెట్టుబడి పెడతారు. ఈ నిపుణులు పెట్టుబడిదారుల తరఫున సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తాడు. ఈ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల నుండి కమీషన్లు తీసుకుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి పెద్దగా తెలియని వారికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి మంచి ఎంపిక.
మ్యూచువల్ ఫండ్స్ రకాలు
ఫైనాన్షియల్ సంస్థలు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. స్కీమ్ రకం, ఫండ్ లక్ష్యాలు, పెట్టుబడి పెట్టిన ఆస్తులు మొదలైన వాటి ఆధారంగా వీటిని అనేక కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి.
- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
- డెట్ మ్యూచువల్ ఫండ్స్
- హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్: ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంటే దాన్ని ఈక్విటీ ఫండ్ అంటారు. వీటిపై మార్కెట్ రిస్క్‌తో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది.
డెట్ మ్యూచువల్ ఫండ్స్: ఫిక్స్‌డ్ ఇన్కమ్ ఇన్‌స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. డెట్ ఫండ్స్ విషయంలో కంపెనీలు కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు వంటి రిస్క్ తక్కువగా ఉండే మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే వీటిలో లాభాలు ఎక్కువగా ఉండవు. డెట్ ఫండ్స్‌లో ఫిక్స్‌డ్ రిటర్న్‌లతోపాటు డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి డెట్ ఫండ్స్ మంచి ఆప్షన్.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: కొన్ని కంపెనీలు షేర్లలో కొంత మొత్తాన్ని, డెట్ సెక్యూరిటీలలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి పథకాలను హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫండ్ కంపెనీ పెట్టుబడి పెట్టే షేర్ల రకాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ రకాలు కూడా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్ వల్ల కలిగే ప్రయోజనాలు
మ్యూచువల్ ఫండ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ మీ పెట్టుబడిని ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు, అతను మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉంటాడు. అటువంటి పరిస్థితిలో, అతను మీ డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడతాడు, అక్కడ రాబడి మంచిదని భావిస్తున్నారు. అదే సమయంలో, మీ పోర్ట్‌ఫోలియో మ్యూచువల్ ఫండ్ల ద్వారా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ, కేవలం ఒక వాటాకు బదులుగా, డబ్బును వేర్వేరు వాటాలలో లేదా ఆస్తి తరగతిలో ఉంచారు. ఒకదానిలో ప్రమాదం ఉంటే, అది మరొకదాని ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది.
మీ డబ్బు డెట్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టబడింది, కాబట్టి మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, డబ్బు ఇప్పటికీ సురక్షితంగా ఉంది. మీరు పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తంపై పరిమితి లేనప్పటికీ, రూ. 500 కంటే తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అయితే ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు(ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం) మాత్రమే మీరు పన్ను ప్రయోజనాన్ని పొందుతారని గుర్తుంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంలో గరిష్టంగా కమిషన్ 2.5%(సెబీ నిబంధనల ప్రకారం) వరకు తీసుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment