ఒక బడా ఐటీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఇతర కంపెనీలకూ పని చేస్తున్నట్టు తేలింది. ఇంకేముంది? యాజమాన్యం అతన్ని తొలగించింది. కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్‌ట్యాప్‌లు ఉండడమే కాదు, ఏ ల్యాప్‌ట్యాప్‌ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ.
మూన్‌లైటింగ్ ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది. పేరోల్‌లో ఉన్న 300 మందిని విప్రో తొలగించడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్ (ఒకటికి మించి కంపెనీలకు సేవలు అందించడం) చట్టబద్ధత, నైతికతపై ఇప్పుడు చర్చ ఊపందుకుంది. మూన్‌లైటింగ్ మోసం అంటూ విప్రో చైర్మన్ రిశద్ ప్రేమ్‌జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘చేరిన సమయంలో కంపెనీ కోసం మాత్రమే పని చేస్తామని ఒప్పందంపై సంతకం పెడతారు. అయినప్పటికీ అభ్యర్థులు తమ మిగిలిన సమయంలో ఏమి చేయాలో ఎంచుకోవచ్చు. అలా చేయడం నైతికంగా సరైనది కాదు’ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అన్నారు. ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ద్వంద్వ ఉద్యోగాలను అనుమతించేది లేదని నొక్కిచెప్పింది. కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తీసివేస్తామని హెచ్చరించింది. వేలాది కంపెనీలు మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇవేవీ బయటకు పొక్కడం లేదు.
దేశంలో 2008 నుంచి 2020 వరకు ఐటీ రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి కొంత అభద్రతా భావంతో పనిచేశారు. ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి టెక్నాలజీలు ఏ క్షణంలో తమ ఉద్యోగాలకు ఎసరు పెడతాయో తెలియని పరిస్థితి. ఆ సమయంలో ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఎక్కువ పని గంటలు, అతి తక్కువ వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు సుదీర్ఘ కాలం తీసుకోవడం లాంటి పరిస్థితి దాచాలన్నా దాగని వాస్తవం.
కానీ 2020లో కోవిడ్ రాకతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు డిజిటల్ వైపు మారాయి. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు వెల్లువెత్తాయి. ఎవరూ ఊహించని ఈ పరిస్థితితో ఐటీలో మానవ వనరుల కొరత తీవ్రమైంది. అప్పటి వరకు బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్న ఉద్యోగులకు రెండు, మూడు రెట్ల జీతం ఇచ్చి కంపెనీలు తీసుకున్నాయి. ఫ్రెషర్లకు, అరకొరగా స్కిల్స్, నాలెడ్జి ఉన్న అభ్యర్థులను సైతం నియమించుకున్నాయి. ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు క్యూ కట్టడంతో ఉద్యోగుల సమస్యపై కంపెనీలు వ్యూహాత్మక మౌనం పాటించాయి. మూడవ లాక్‌డౌన్ తరువాత ప్రాజెక్టులు కూడా క్రమబద్ధం కావడంతో ఉద్యోగుల సమస్య వైపు కంపెనీలు దృష్టి సారించాయి. అందులో మొదటి అడుగు హైబ్రిడ్ పని విధానం. ఈ విధానంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ప్రకటించాయి. కొన్ని కంపెనీలు పూర్తిగా ఆఫీస్ నుంచే విధులు నిర్వర్తించాలని తేల్చిచెప్పాయి.
ఇక్కడే సమస్య మొదలైంది. కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగులలో చాలామందికి సరైన నైపుణ్యాలు, అనుభవం లేవని, వాళ్ళు కంపెనీకి సమర్పించిన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు కూడా తప్పుడువేనని తేలింది. ఈ సమస్యను మరింత లోతుగా పరిశీలించడంతో నమ్మశక్యం కానీ విషయాలు ఐటీ కంపెనీలకు బోధపడ్డాయి. ఇంటి నుంచి పని నేపథ్యంలో అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఒకేసారి రెండు, మూడు కంపెనీలకు పనిచేస్తున్నట్లు (మూన్‌లైటింగ్) గుర్తించాయి. కొందరైతే వాళ్ళ పనిని అనుభవజ్ఞులకు ఇచ్చి చేయించుకున్నట్లు తేలింది. మరోవైపు కొత్తగా చేరినవారిని, బెంచ్‌పైన ఉన్న అభ్యర్థులను క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఇంటర్వ్యూలో గట్టెక్కితేనే కంపెనీ జీతం చెల్లిస్తుంది. లేదంటే ఇంటిబాట పట్టాల్సిందే!
గడిచిన రెండేళ్లలో రెండు చేతులా సంపాదనకు అలవాటు పడ్డ సిబ్బంది కొంతమంది ఉన్న ఉద్యోగాలలో మంచిది ఒకటి ఎంచుకొని హైబ్రిడ్ విధానానికి మారారు. ఇంకొంతమంది మూన్‌లైటింగ్ విధానాన్ని చట్టబద్ధం చేయాలని బహిరంగంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపైన చర్చ ఊపందుకొంది. ఈ పరిస్థితుల్లో నాణ్యత దెబ్బతినడం, డేటా ప్రైవసీకి భంగకరం అని క్లయింట్లు భావించి ప్రాజెక్టులను రద్దు చేసుకుంటే పరిస్థితి ఏంటని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.
మనుగడకే ఇబ్బంది
కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అత్యంత అనుకూలం, లాభదాయకం. కానీ ఉద్యోగులు ఎంచుకుంటున్న విధానాలను క్రమబద్ధం చేయకుంటే ప్రపంచ ఐటీ రంగంలో భారత కంపెనీల పట్ల ఉన్న సానుకూలతను చేజేతులా కోల్పోతాము. విదేశీ క్లయింట్లు డేటా సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తాయి. అందుకు ఉన్న చట్టాలు కూడా రోజు రోజుకి పటిçష్ఠం అవుతున్న సంగతి అనుభవజ్ఞులైన ఉద్యోగులకు తెలుసు. తమ ఉద్యోగులు రెండు మూడు కంపెనీలకు పనిచేస్తున్న విషయం తెలిస్తే మెజారిటీ క్లయింట్లు ప్రాజెక్టులను వెనక్కి తీసుకుంటే ఒక్క ఐటీ మాత్రమే కాకుండా దేశ ఆర్థిక రంగాన్ని కూడా విషమ పరిస్థితుల్లోకి నెట్టడం ఖాయం. కొంతమంది క్లయింట్లు కన్సల్టెంట్ విధానానికి మొగ్గు చూపినా, బిల్లింగ్ విషయంలో విపరీతంగా తగ్గిస్తే కంపెనీల ఆదాయంలో భారీ కోతపడే అవకాశం ఉంటుంది. కన్సల్టెంట్ విధానం స్వల్పకాలంలో కంపెనీలకు, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు లాభదాయకంగా కనపడినా, ధీర్ఘకాలంలో ఐటీ రంగం మనుగడకే ఇబ్బంది. అవర్లీ బిల్లింగ్ లేదా మొత్తం పని గంటలు గణనీయంగా తగ్గించమని ఒత్తిడి చేస్తే కంపెనీల ఆదాయం, లాభాలు తగ్గుతాయి.
ఐటీ రంగానికి గొడ్డలిపెట్టు
మూన్‌లైటింగ్ విధానం ఐటీ రంగానికి ఒక గొడ్డలిపెట్టు. ఈ విధానానికి అనుభజ్ఞులైన ఉద్యోగుల నుండి మద్దతు పెరుగుతూ ఉంటే మరొక వైపు లక్షల సంఖ్యలో నిరుద్యోగులుగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు.. తమ అవకాశాలను గణనీయంగా దెబ్బ తీస్తుందని ఆందోళన చెందుతున్నారు. మూన్‌లైటింగ్ చట్టబద్ధం అయితే కంపెనీలు ఫ్రెషర్ల నియామకాలకు, క్యాంపస్ రిక్రూట్‌మెంట్లకు స్వస్తి పలుకుతాయని భావిస్తున్నారు. ‘వైద్య రంగంలో డాక్టర్ల కొరత ఉంటుంది కాబట్టి వాళ్లకు కన్సల్టెంట్ విధానం పనికి వస్తుంది. కానీ లక్షల సంఖ్యలో మానవ వనరులు ఉన్న సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ విధానం అవసరం లేదు’ అని కాంటార్ జీడీసీ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ కందుకూరి సురేశ్ బాబు తెలిపారు.
మూన్‌లైటింగ్‌కు ఓకే
మూన్‌లైటింగ్‌ను సమర్థించే కంపెనీలూ లేకపోలేదు. టెక్ మహీంద్రా సీఈవో సి.పి.గుర్నానీ అయితే కాలానికి అనుగుణంగా మారుతూ ఉండవలసిన అవసరాన్ని ఎత్తి చూపారు. పని విధానంలో మార్పులను స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ‘ఎవరైనా సమర్థత, ఉత్పాదకత నిబంధనలకు అనుగుణంగా, ఆ వ్యక్తి మోసం చేయనంత వరకు కొంత అదనపు డబ్బు సంపాదించాలని కోరుకుంటే తన కంపెనీ విలువలు, నైతికతకు విరుద్ధంగా ఏమీ చేయరు. ఈ విషయంలో నాకు ఏమీ ఇబ్బంది లేదు. రెండు చోట్లా పని చేయడాన్ని ఒక విధానంగా చేయాలనుకుంటున్నాను. మీరు దీన్ని చేయాలనుకుంటే సంతోషం. కానీ దాని గురించి బహిరంగంగా ఉండండి’ అని గుర్నానీ అన్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ మూన్‌లైటింగ్ పాలసీని ప్రకటించింది. సంస్థ విధులకు ఆటంకం కలగకుండా గిగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు తన ఉద్యోగులకు అనుమతినిచ్చింది.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే, పని విషయంలో స్విగ్గీ, విప్రో.. పూర్తిగా భిన్నమైన స్వభావం కలవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడానికి స్విగ్గీని ఉదాహరణగా పేర్కొంటున్నారు. అయితే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉందని ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా గుర్తు చేశారు. ‘విప్రో వర్సెస్ స్విగ్గీ – ఈ రెండు కంపెనీలనూ ఒకేగాటన కట్టలేము. ఫార్చూన్–500 కంపెనీలకు విప్రో సేవలు అందిస్తోంది. ఈ సంస్థలకు డేటా గోప్యత ప్రాణప్రదమైనది. డేటా బయటకు పొక్కే అవకాశం ఉందని భావిస్తే అవి సహించవు’ అని అన్నారు.
‘ఒక సంస్థలో పనిచేస్తూ మరో కంపెనీకి మూన్‌లైటింగ్‌కి పాల్పడడం అనైతికం. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. దీనికి అనుమతించేది లేదు. కానీ భవిష్యత్ వర్క్‌ఫోర్స్ మోడల్ అనేది కన్సల్టెంట్లుగా పనిచేసే వ్యక్తుల సమూహం. సహకార సమూహాలుగా కంపెనీల కోసం ఉత్పత్తులను రూపొందిస్తారు. వారు ఒకే సమయంలో ఐదు వేర్వేరు కంపెనీల కోసం దీన్ని చేయవచ్చు. అయితే చాలామంది వ్యక్తులు భవిష్యత్తులో వ్యవస్థాపకులుగా మారబోతున్నారని, వారు సొంతంగా కంపెనీలను ప్రారంభించాలని చూస్తున్నారని కంపెనీలు గుర్తించాలి’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
‘ఉద్యోగుల నుంచి పారదర్శకత లేకపోవడం వల్ల మూన్‌లైటింగ్‌పై భిన్నాభిప్రాయాలు ఉత్పన్నమవుతాయి. పూర్తి సమయం ఉద్యోగిగా ఉన్నప్పుడు ప్రస్తుత యజమానికి తెలియజేయకుండా ఇతర అవకాశాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడే సమస్య తలెత్తుతుంది. ఇక్కడే యజమాని, ఉద్యోగుల మధ్య నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. దీనిని ఎలా పరిష్కరించాలన్నదే ముందున్న సవాలు. మహమ్మారి తదనంతరం పని విషయంలో ఉద్యోగుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా కంపెనీలు అప్‌గ్రేడ్ అవ్వాలి. కంపెనీలు రెండు మోడళ్లను స్వీకరించాలి. ఒకటి కంపెనీలో పూర్తి సమయం కేటాయించే ఉద్యోగులను కలిగి ఉండడం. మరొకటి గిగ్ వర్కర్లతో సైతం పనులు చేయించుకోవడం. బహుళ ఉద్యోగాలు చేయడం సమస్య కాదు. కానీ దీన్ని ఎలా చేస్తారన్నదే ప్రశ్న’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేబజానీ ఘోష్ వెల్లడించారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) భారత్‌లో సాంకేతిక పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఒప్పందానికి కట్టుబడాల్సిందే!
ఉద్యోగి ఒక కంపెనీలో చేరే ముందు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆ ఎంప్లాయీ ఒప్పందానికి కట్టుబడాల్సిందే! ఇక్కడ పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం, మేధాసంపత్తి హక్కులను, వ్యాపార రహస్యాలను, సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం, ల్యాప్‌టాప్ వంటి సంస్థ అందించిన ఆస్తులను ఇతరులతో, ఇతర కంపెనీలతో పంచుకుంటే ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. ఇలా ఒప్పందాన్ని కాలరాసిన ఉద్యోగిని తీసివేసే హక్కు సంస్థలకు ఉంటుంది. ‘ఉద్యోగులు తమ ఆఫర్ లెటర్‌లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. వారు ఒకటి కంటే ఎక్కువ కంపెనీలతో పని చేయాలనుకుంటే గిగ్ వర్కర్‌గా కెరీర్ ఎంచుకోవచ్చు’ అని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ మనీషా సబూ తెలిపారు.
ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా
‘ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఐటీ కంపెనీలు 2003–04లో రూ.2.5–3 లక్షలు ఆఫర్ చేశాయి. ఇప్పుడు ఇదే రోల్‌కు రూ.3–3.5 లక్షలు చెల్లిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగికి ఇప్పుడు వేతనం రూ.6.5–7 లక్షలు ఉండాలి. జీతాలు మెరుగ్గా ఉంటే జాబ్ వదిలేయరు. మూన్‌లైటింగ్‌కు పాల్పడరు’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు.
గిగ్ కార్మికులు
స్వతంత్రంగా, తాత్కాలికంగా పనిచేసేవారే గిగ్ కార్మికులు. అంటే ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్స్ వంటి వారు అన్నమాట. ఫ్రీలాన్స్ ఐటీ నిపుణులూ గిగ్ జాబితాలో వచ్చి చేరారు. పని, కాంట్రాక్ట్ పూర్తి అయ్యేవరకు లేదా కొన్ని గంటల కాలానికి వీరు సేవలు అందిస్తారు. వీరి కోసం ఆన్‌లైన్ వేదికలూ వచ్చాయి. గిగ్‌వర్కర్, గిగ్‌ఇండియా, వర్క్‌ఫ్లెక్సి, ఫ్లెక్సిపుల్, ఫ్లెక్స్‌జాబ్స్, జంగిల్‌వర్క్స్, గిగ్‌మోస్ వంటివి వీటిలో ఉన్నాయి. ఈ వేదికల్లో కార్మికులు, నిపుణులు తమ పేర్లను నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ల కాల్స్ ఆధారంగా పని ఒప్పదం కుదురుతుంది. ఫలానా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ పోర్టల్స్‌లో తాటికాయంత అక్షరాలతో ఇవి ఊదరగొడుతున్నాయి. అంతేకాదు ఎన్ని డబ్బులు అందుకుంటారో వెల్లడిస్తున్నాయి. ఏ కంపెనీకి ఎంతమంది నిపుణుల సేవలు అవసరమో కూడా స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని గంటలు, రోజులు పనిచేయాల్సి ఉంటుందీ తెలియజేస్తున్నాయి.
ఎందుకు ప్రోత్సహిస్తున్నాయంటే?
నిపుణుల కొరత, సేవల ఖర్చు పెరగడం, సరైన నిపుణుల దొరక్కపోవడం, సమయానికి పనులు పూర్తి చేయడం కోసం, పోటీ కంపెనీని దెబ్బతీయడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి, త్వరితగతిన ప్రాజెక్టును డెలివరీ చేయడం కోసం కొన్ని కంపెనీలు మూన్‌లైటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ప్రధానంగా స్టార్టప్స్ ఇందుకు సై అంటున్నాయి.
అదనపు సంపాదన కోసం...
జీవన వ్యయం అనూహ్యంగా పెరిగింది. బీమా, అద్దెలూ అధికం అయ్యాయి. ‘కోవిడ్’ మహమ్మారి కారణంగా భవిష్యత్తు పట్ల భయం పట్టుకుంది. అనుకోని ఖర్చులు మీద పడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది. జీవనం అస్తవ్యస్తం అయింది. ఉద్యోగం ఉంటుందా లేదా అన్న సందేహం. చివరకు డబ్బే జీవితం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రతిభకు పదునుపెట్టారు. కొత్త కోర్సులు చేశారు. మరో కంట పడటం లేదు కదా అన్న భావనతో ఇతర కంపెనీలకూ పని చేస్తున్నారు. తద్వారా అదనంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇంటి నుంచి పని విధానం ఇందుకు కలిసి వచ్చింది.
ఎలా బయటపడిందంటే?
మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పోర్టల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) సాయంతో కంపెనీలు గుర్తిస్తున్నాయి. యూఏఎన్ ఆధారంగా అభ్యర్థి ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తున్నదీ, ఎప్పుడు చేరిందీ వంటి వివరాలను కంపెనీలు తెలుసుకుంటున్నాయి. అలాగే సంస్థ అందించిన ల్యాప్‌టాప్స్‌ను కంపెనీ సర్వర్ ద్వారా ట్రాక్ చేస్తున్నాయి.
అంతా క్యాష్
మూన్‌లైటింగ్ మరో కంట కనపడకుండా అభ్యర్థులు కన్సల్టెంట్ల అవతారం ఎత్తుతున్నారు. అత్యధికంగా యూఎస్, యూకే కంపెనీల నుంచి కాంట్రాక్ట్ తీసుకుని అవసరం అయితే ఓ నలుగురిని పెట్టుకుని పని పూర్తి చేస్తున్నారు. నగదు రూపంలో మాత్రమే అందుకునే ఈ ప్రతిఫలాన్ని కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. బ్యాంక్ క్యాష్ కార్డులు, గిఫ్ట్ వోచర్లనూ స్వీకరిస్తున్నారు.
- నూగూరి మహేందర్
చట్టం ఏం చెబుతోంది
కార్మిక చట్టాలు కార్మికుల సామాజిక భద్రత కోసం ఉద్దేశించబడ్డాయి. చేస్తున్న పని అలసటకు దారి తీయకూడదు. సాధారణంగా వారానికి 48 గంటలు– అంటే రోజుకు 8 గంటల పని. వారానికి ఒక రోజు విశ్రాంతి ఉంటుంది. రెండు కంపెనీల కోసం ఒక వ్యక్తి పనిచేస్తున్నట్లయితే ఈ భావనను ఉల్లంఘించినట్టే! సాధారణంగా ఒక వ్యక్తిని తొలగించినప్పుడు చేతిలో ఉద్యోగం ఉందా? మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇప్పటికే వేరే ఉద్యోగం ఉంది. కాబట్టి తొలగింపును తీవ్రంగా పరిగణించలేము. కంపెనీలు సాధారణంగా అపాయింట్‌మెంట్ ఉత్తర్వుల్లో తమ వ్యాపార గోప్యత గురించి కూడా పేర్కొంటాయి. ఉద్యోగి ఒకే రకమైన యూనిట్‌లో మరోచోట పనిచేస్తుంటే, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే! కాబట్టి కంపెనీలు చర్య తీసుకోవచ్చు. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్– సెక్షన్ 69 రెండు చోట్లా ఉపాధిని నిరోధించడానికి నిర్దేశించినది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉద్యోగికి సెలవు ఇచ్చిన లేదా సెలవులో ఉన్న ఒక రోజు లేదా రోజులో కొంత సమయం ఏ సంస్థలో కూడా పని చేయకూడదు. ఏ యజమాని అయినా ఉద్యోగిని ఉద్దేశపూర్వకంగా అనుమతించకూడదు.
–శ్యామ్‌సుందర్ జాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, హైదరాబాద్–2
ఒకే ప్రవర్తనా నియమావళి
కోవిడ్ తర్వాత పని విధానం మారింది. కార్పొరేట్లు తమ ఉద్యోగ ఒప్పందాలను పునర్నిర్వచించుకోవాలి. ఉద్యోగులతో సంబంధాలను మెరుగుపరచాలి. ఉద్యోగులు, యజమానుల మధ్య భారీ సంక్లిష్టతను, విభజనను మూన్‌లైటింగ్ సృష్టిస్తోంది. జాతీయ స్థాయిలో ఐటీ ఉద్యోగుల కోసం మోడల్ ప్రవర్తనా నియమావళి అవసరం. పనిగంటలు, సెలవులు, విధి విధానాల విషయంలో ప్రామాణికత రావాలి. ఉద్యోగులకు తమ సంస్థలోనే అదనపు పని గంటలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అందుకు తగ్గట్టుగా నగదుతో ప్రోత్సహించాలి. నిపుణులను సొంతంగా తీర్చిదిద్దాలి. ఇందుకు నియామకాల్లో 30 శాతం మంది ఫ్రెషర్స్ ఉండేలా చూసుకోవాలి. అభ్యర్థి ఉద్యోగంలో చేరుతున్న సమయంలోనే ఒప్పందంలోని అంశాలను సవివరంగా తెలియజేయాలి.
– వెంకా రెడ్డి, హెచ్‌ఆర్ రంగ నిపుణుడు
నియామకాల్లో స్తబ్ధత
తప్పుడు ఇంటర్వ్యూలు, తప్పుడు అనుభవ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగులను తొలగించడాన్ని కంపెనీలు వేగవంతం చేశాయి. గత రెండు, మూడు నెలలుగా నూతన నియామకాలు చేపట్టకుండా తప్పుడు అభ్యర్థులను తొలగించడంపైన దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా నియామకాల్లో స్తబ్ధత నెలకొంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపొతే క్లయింట్ల నమ్మకం కోల్పోయి తమ సంస్థలే కాకుండా ఐటీ రంగం మొత్తం కుదేలయ్యే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీ గుర్తించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
– నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్
Comments
Please login to add a commentAdd a comment