టాక్స్ ఆడిట్ అంటే? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొందరికి ఆడిట్ వర్తిస్తుంది. అలా చేయించే ఆడిట్‌నే ట్యాక్స్ ఆడిట్ అంటారు.
ఎవరికి వర్తిస్తుంది?
ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం మీ టర్నోవరు/బిజినెస్ వసూళ్లు/బ్యాంకులో రశీదులు అక్షరాలా ఒక కోటి రూపాయలు దాటితే కంపల్సరీగా ఆడిట్ చేయించాలి. వ్యాపారస్తులకు ఈ పరిమితి రూ. 1 కోటి. వృత్తి నిపుణులకు అయితే రూ. 50,00,000 పరిమితిగా ఉంటుంది.
ఎవరు చేస్తారు?
ఈ ఆడిట్‌ని డిపార్టుమెంట్ వారు చేయరు. చట్టప్రకారం మనమే.. అంటే అస్సెస్సీలే తమ టర్నోవరు రూ. 1 కోటి దాటితే ప్రాక్టీసులో ఉన్న సీఏ చేత చేయించాలి. ఈ ఆడిట్‌ను మనంతట మనమే స్వయంగా చేయించాలి. అంటే వాలంటరీగా చేయాలి. అలా చేయించినందుకు సీఏకి ఫీజు మనమే ఇవ్వాలి. సకాలంలో చేయించకపోయినా, చేసి ఆడిటర్ రిపోర్ట్‌ను సమరి్పంచకపోయినా, చాలా పెద్ద మొత్తంలో పెనాల్టీలు వేస్తారు.
ఆడిట్ వెనుక లక్ష్యం ఏమిటంటే..
♦ సరైన, తగిన విధంగా, కరెక్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ను నిర్వహించేలా చూడటం.
♦ అలా నిర్వహించిన అకౌంటు మొదలైన వాటిని సీఏ సర్టిఫై చేయాలి లేదా ధృవీకరించాలి.
♦ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు దొరికిన తప్పులు, దొర్లిన తప్పొప్పులు, తేడాలు, మిస్ అయిన అంశాలు, తప్పుడు సమాచారాలు, డబుల్ అకౌంటింగ్, ఆదాయంలో హెచ్చుతగ్గులు, ఖర్చుల్లో హెచ్చుతగ్గులు, వ్యక్తిగత ఖర్చులు, సమంజసం కాని ఖర్చులు, సంబంధం లేని ఖర్చులు, కేవలం ఆ సంవత్సరానికి సంబంధించినవే రాశారా లేదా వేరే సంవత్సరానివి రాశారా, ఆ వ్యాపారానివేనా లేక వేరే వ్యాపారానికి సంబంధించినవా, ఆ వ్యక్తి ఖర్చేనా లేక వేరే వ్యక్తికి సంబంధించినదా? క్యాపిటల్ ఖర్చెంత, రెవెన్యూ ఖర్చెంత? ఒకదానికొకటి సర్దుబాటు చేయలేదు కదా? స్థిరాస్తి కొని మామూలు ఖర్చుగా రాశారా? ఇలా వందలాది ప్రశ్నలకు జవాబులు ఈ రిపోర్టులో రాయాలి.
♦ అంతే కాకుండా అస్సెస్సీ కేవలం చట్టప్రకారం తనకు అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రయోజనాల తగ్గింపులు, మినహాయింపులు మాత్రమే పొందారా లేక అదనంగా ఏదైనా లబ్ధి పొందారా?
♦ అంతే కాకుండా, ఇతర చట్టాల ప్రకారం, అంటే ఈఎస్‌ఐ, పీఎఫ్, జీఎస్‌టీ, కంపెనీ లా మొదలైన వాటి ప్రకారం చెల్లింపులు, అవి సక్రమమేనా, సకాలంలో చెల్లించారా .. ఇలా ఎన్నో విషయాలు బయపడతాయి. మీకు నిబంధనలు వర్తించే పక్షంలో ట్యాక్స్ ఆడిట్ తప్పక చేయించండి. అదే మీకు శ్రీరామరక్ష.
-కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి ( ట్యాక్సేషన్ నిపుణులు)
-కె.వి.ఎన్ లావణ్య( ట్యాక్సేషన్ నిపుణులు )
Comments
Please login to add a commentAdd a comment