మెర్సిడెస్ బెంజ్.. ప్రపంచ మార్కెట్లో పరిచయం అవసరంలేని బ్రాండ్. ఈ రోజు లగ్జరీ కార్ల విభాగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు, బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయమే కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం 'బెర్తా బెంజ్' అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య.
కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్.. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, ఇంజన్ డిజైనర్ కూడా. ఈయన 1885లో బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ను సృష్టించారు. ఇదే అతని మొదటి ఆటోమొబైల్. అయితే ఇది రోడ్డుపై ఎలా పనిచేస్తుందనే విషయం మీద కొంత అనుమానం మాత్రం కార్ల్ బెంజ్ మనసులో ఉండేది. కానీ బెర్తా బెంజ్ మాత్రం ఆ వాహనం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ కారణంగానే భర్తకు తెలియకుండానే ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.
1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు.
నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..
బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్ అమ్మకాలు మొదలైన తరువాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. బెర్తా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే.. బెంజ్ కారును ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. నేడు ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో.. ఎంతలా ఎదిగిందో అందరికీ తెలుసు.
Comments
Please login to add a commentAdd a comment