న్యూఢిల్లీ: సహకార రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్రాలు కలసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు. రాష్ట్రాల సహకార శాఖల మంత్రుల రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ సహకార ఉద్యమం ఒకే వేగంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సహకార రంగం కార్యకలాపాలు నిదానించిన చోట, తగ్గుముఖం పట్టిన చోట వెంటనే వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే మనకు జాతీయ సహకార విధానం కావాలన్నారు. నూతన విధానం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోపరేటివ్ రంగం సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా, కొత్త విభాగాలను గుర్తించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. సహకార ఉద్యమం దక్షిణ భారత్, పశ్చిమ భారత్‌లో బలంగా ఉందన్నారు. ఉత్తర, మధ్య భారత్‌లో అభివృద్ధి దశలో ఉంటే, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువ అభివృద్ధికి నోచుకున్నట్టు చెప్పారు.
100 ఏళ్ల లక్ష్యం.. : కోపరేటివ్ రంగం అభివృద్ధికి రాష్ట్రాలన్నీ ఒకే మార్గాన్ని, ఏకీకృత విధానాలను అనుసరించాలని అమిత్‌షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వారమే 47 మంది సభ్యులతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అధ్యక్షతన గల ఈ ప్యానెల్ సహకార రంగానికి సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయలని అమిత్‌షా కోరారు. ‘‘మన లక్ష్యం 100 ఏళ్లుగా ఉండాలి. కోపరేటివ్‌లు దేశ ఆర్థిక రంగానికి మూలస్తంభంగా మారాలి’’అని అమిత్‌షా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కోపరేటివ్ రంగం వృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ల సంఖ్యను ఐదేళ్లలో మూడు లక్షలకు పెంచడంతోపాటు, డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment