టీవీ అనగానే ఒకప్పుడు 21 అంగుళాలవే ఉండేవి.. ఇప్పుడు ఏకంగా 75 అంగుళాలు అంతకన్నా ఎక్కువ సైజుల్లోనూ లభిస్తున్నాయని తెలుసు.. కానీ ఈ భారీ సైజులకు పూర్తి వ్యతిరేకంగా ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న టీవీలను అమెరికాకు చెందిన టైనీ సర్క్యూట్స్ అనే కంపెనీ తయారు చేసింది. చిన్న టీవీలు అనగానే ఏదో మన స్మార్ట్‌ఫోన్ల సైజులో ఉంటాయిలే.. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోకండి.. ఎందుకంటే ఇవి అంతకన్నా చిన్నవి మరి!! అంటే ఒక పోస్టల్ స్టాంపు సైజులో కేవలం అర అంగుళం, అంగుళం సైజుల్లో తయారైనవి అన్నమాట!!
మార్కెట్లో టీవీల సైజులు రోజురోజుకూ పెరుగుతుంటే ఈ కంపెనీ మాత్రం ఇలా వెరైటీగా బుజ్జిబుజ్జి టీవీలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు నమూనా టీవీలను తాజాగా ఆవిష్కరించింది. 0.6 అంగుళాల తెరతో టీనీటీవీని, ఒక అంగుళం స్క్రీన్‌తో టైనీటీవీ–2ను తీసుకొచ్చింది. పాతకాలం టీవీల్లో చానళ్లు మార్చుకొనేందుకు, వాల్యూమ్ పెంచుకొనేందుకు వీలుగా ఉండే గుండ్రటి నాబ్‌లను వీటికి కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ టీవీల్లో సాధారణ చానళ్ల ప్రసారాలు మాత్రం రావు! మరి ఇంకేం వస్తాయంటారా? ఈ టీవీల్లో అమర్చిన 8 జీబీ మెమరీ కార్డుల ద్వారా 10 గంటల నుంచి 40 గంటల వరకు వీడియోలను ప్లే చేసుకోవచ్చు. అయితే వీటిలో కొన్ని ప్రీ ఇన్‌స్టాల్డ్ వీడియోలను కూడా కంపెనీ సిద్ధం చేసింది.
ఈ బుజ్జి టీవీల్లో మరో ప్రత్యేకత ఏమిటంటే కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్‌లో ఉండే ఫేవరేట్ సినిమాలు, వ్యక్తిగత వీడియోల ఫైళ్లను కంపెనీ అందించే ఉచిత సాఫ్ట్‌వేర్ ద్వారా వేరే ఫార్మాట్‌లోకి మార్చుకొని ఇందులో వీక్షించొచ్చు. ఇంతకీ వీటి ధర ఎంతో తెలుసా సుమారు 4-5 వేల రూపాయలు.
Comments
Please login to add a commentAdd a comment