మహిళపై దాడి
శ్రీరంగరాజపురం : మహిళపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన మండలంలోని దిగువ కమ్మకండ్రిగ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితురాలు సబ్బలక్ష్మి కథనం మేరకు.. తన భర్త వెంకటేష్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీలో విధులు నిర్వహిస్తుండగా కొంత మంది వ్యక్తులు అవినీతి ఆరోపణలు చేస్తూ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేకు పిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి అధికారులు ఎగువ కమ్మకండ్రిగ పంచాయతీ ప్రజలను విచారించారు. ఈ విచారణలో ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎటువంటి ఆరోపణలు రాకపోవడంతో జిల్లా అధికారులు క్లీన్‌చిట్ ఇచ్చారు. దీనిని జీర్ణించుకోలేని రమేష్, అమరేంద్రన్ కలసి వెంకటేష్ భార్య అయిన తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. తనకు, తన భర్త వెంకటేష్‌కు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కన్నీటి వీడ్కోలు
కుప్పంరూరల్ : మండలంలోని మల్లానూరు గ్రామంలో ఆదివారం జరిగిన జల్లికట్టులో ఎద్దును నిలువరించేందుకు వెళ్లి గాయపడిన కరుణాకరన్‌కు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కరుణాకరన్ ఆదివారం గాయపడగా వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మంగళవారం మృతదేహాన్ని సీఎంసీ నుంచి కుప్పం తీసుకొచ్చారు. ఇక్కడ వంద పడకల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు కరుణాకరన్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నిన్నటి వరకు తమ మధ్యనే ఉన్న కరుణాకరన్ మృతిని జీర్ణించుకోలేని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా కరుణాకరన్‌కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
బోల్తా పడిన ట్రాక్టర్
● డ్రైవర్, ముగ్గురు కూలీలకు గాయాలు
పెనుమూరు(కార్వేటినగరం) : ఇటుక రాళ్ల లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడి డ్రైవర్, ముగ్గురు కూలీలకు గాయాలైన సంఘటన మండల పరిధిలోని పులికల్లు వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా.. బందార్లపల్లికి చెందిన రామనాథరెడ్డికి చెందిన ట్రాక్టర్‌లో ఇటుకలను పెనుమూరుకు తీసుకెళుతుండగా పులికల్లు పాఠశాల సమీపంలోని మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు కూలీలకు గాయాల య్యాయి. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన నలుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment