విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి
బంగారుపాళెం : కూలీ పనులకు వెళ్లి పొలం వద్ద విద్యుదాఘాతానికి గురై మహిళా వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలోని ఎన్.కోటూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఎన్.కోటూరు దళితవాడలో నివాసం ఉంటున్న సదాశివయ్య భార్య చిట్టెమ్మ(55) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన సురేంద్రబాబు వ్యవసాయ బావి వద్ద వరిలో కలుపు తీసేందుకు వెళ్లింది. పొలం పక్కన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె కమ్మికి పచ్చటి తీగలు అల్లుకుపోయాయి. ప్రమాదవశాత్తు రక్షణ కంచె కమ్మిని చిట్టెమ్మ చేతితో తాకడంతో విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయ పడింది. సహచర కూలీలు ఆమెను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బాధితురాలి భర్త సదాశివయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పూతలపట్టు వీఆర్‌ఓ హఠాన్మరణం
పూతలపట్టు (కాణిపాకం): పూతలపట్టు మండల కేంద్రానికి సంబంధించిన వీఆర్‌ఓ ధరణికృష్ణ (38) మంగళవారం గుండె పోటుతో మృతిచెందారు.ఈయన పెనుమూరు మండలం పులికల్లు స్వగ్రామం. ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న కొద్ది సేపటికే గుండెపోటు గురై అపస్మారస్థితికి వెళ్లిపోయారు. ఈవిషయాన్ని గమనించిన కుటుంబికులు పెనుమూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పని ఒత్తిడి కారణంగానే గుండె పోటుకు గురై మృతి చెందినట్లు పలువురు రెవెన్యూ సిబ్బంది ఆరోపిస్తున్నారు.
విద్యుదాఘాతంతో మహిళా కూలీ మృతి
Comments
Please login to add a commentAdd a comment