నేడు రథోత్సవం, తెప్పోత్సవం
● శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ● ముక్కంటి దర్శనానికి పోటెత్తిన భక్తులు ● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ● విశిష్ట వాహనాలపై ఊరేగిన ఆదిదంపతులు ● శివనామస్మరణతో మార్మోగిన దక్షిణ కై లాసం
ఇంద్ర విమానంపై ముక్కంటి రాజసం
హర హర మహాదేవ.. శంభో శంకర..
నమో పార్వతీపతయే నమః.. ముక్కంటీశా పాహిమాం.. పరమేశ్వరా రక్షమాం.. ఓం నమఃశ్శివాయ అంటూ ఆదిదేవుని స్మరిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. మహిమాన్విత వాయులింగేశ్వరుని
దివ్యతేజస్సును వీక్షించి పులకించారు.
ఆదిమధ్యాంత రహితుని ఆత్మలింగ దర్శనంతో పునీతులయ్యారు. నిజరూపంతో
సాక్షాత్కరించిన నీలకంఠుని సేవించుకుని తరించారు. ఇంద్ర విమానంపై ఊరేగుతున్న
కై లాసనాథునికి కర్పూర నీరాజనాలు
సమర్పించారు. అత్యంత ప్రీతిపాత్రమై నంది వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో
విహరిస్తున్న లయకారుని మనసారా స్తుతిస్తూ పరవశించారు. పవిత్ర లింగోద్భవ కాలంలో త్రినేత్రుని తేజోవిరాజిత మూర్తిని దర్శించుకుని కోటి జన్మల పుణ్యఫలం
పొందారు.
శ్రీకాళహస్తి : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. వాయులింగేశ్వరుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలు జరిపించారు. అలాగే ఉచ్ఛికాలాభిషషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం చేపట్టారు. పర్వదినం సందర్భంగా మొత్తం 9 విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈక్రమంలోనే మహాశివరాత్రిని పురస్కరించుకుని వేకువజామున 2గంటలకే మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛారణ చేస్తూ స్వామి, అమ్మవార్లను మేల్కొలిపారు. అనంతరం గోపూజ చేశారు. 3 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 5 నుంచి 10.30 గంటల మధ్య స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు.
ఇబ్బందులు లేకుండా..
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాలఘు దర్శనం అమలు చేయడంతో భక్తులు సులభతరంగా స్వామి, అమ్మవార్లను సేవించుకునే వెసులుబాటు ఏర్పడింది. క్యూలను విభజించి పకడ్బందీగా నిర్వహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనివితీరు ముక్కంటీశుని దర్శించుకునే అవకాశం కలిగింది. ఈ మేరకు సుమారు 1.5లక్షల మంది భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు తలెత్తలేదని వివరించారు.
మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఇంద్రవిమానంపై పురవీధుల్లో ఊరేగారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చప్పరంపై కొలువుదీరి అనుసరించారు. మూషిక వాహనంపై వినాయకుడు, శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప చప్పరాలపై ఊరేగింపులో ముందుకు సాగారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులతో నాలుగు మాడవీధులు కిక్కిరిసిపోయాయి. కళాకారులు పలు కళారూపాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఈఓ బాపిరెడ్డి పాల్గొన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మహోత్సవం ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశౠరు. అలాగే రాత్రి నారద పుష్కరణిలో శివపార్వతులు తెప్పలపై విహరించనున్నారు. ఈ మమేరకు పుష్కరణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment