‘వివాదాల’ వైద్యఆరోగ్యం
● డీఎంఅండ్‌హెచ్ కార్యాలయంలో ఇష్టారాజ్యం ● విధుల కేటాయింపుల్లో రాజకీయం ● సీనియర్లకు అన్యాయం.. జూనియర్లకు అవకాశాలు ● మార్పులు.. చేర్పులపై బహిరంగ విమర్శలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గందరగోళం నెలకొంది. ఇంటిపోరు తార స్థాయికి చేరింది. మానిటరింగ్ విభాగంపై వివక్ష చూపుతున్నారు. కక్ష్య కట్టి ముగ్గురు సీనియర్లను కార్యాలయం నుంచి తప్పించారు. అనుకూలంగా ఉన్న జూనియర్లను తెచ్చుకుంటున్నారు. దీంతో కార్యాలయంలో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రెండు నెలల కిందట చిత్తూరు జిల్లా డీఎంఅండ్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న ప్రభావతి బదిలీ అయ్యారు. ఈ స్థానానికి చంద్రగిరిలో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆమెకు చేరువయ్యారు. దీంతో కార్యాలయ పెత్తనం ఆ కొందరి చేతుల్లోకి వెళ్లిపోయింది. వాళ్లు ఊ అంటే ఆ జిల్లా స్థాయి అధికారి ఉలిక్కిపడుతున్నారు. వారి చెప్పిందే వేదంగా కార్యాలయాన్ని నడిపిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో ముగ్గురు మానిటరింగ్ అధికారులపై వేటు వేశారు. డాక్టర్ శిరీష, హనుమంతరావు, జానకీరావ్‌లను కక్ష్య కట్టి కార్యాలయం నుంచి తప్పించారు. వెంటనే వారిని కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని, ఈ స్థానానికి జూనియర్లు అంటే..పూతలపట్టు వైద్యులు ప్రవీణ, బొమ్మసముద్రం నుంచి అనూష, ఎస్‌ఆర్‌పురరరం నుంచి గిరిలను పట్టుబట్టి.. కార్యాలయాన్ని తీసుకొచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కార్యాలయంలో లుకలుకలు మొదలయ్యాయి. ఇదంతా కార్యాలయంలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ వ్యవహారం బయట పడుతుందని ఆ ముగ్గురిని టార్గెట్ చేసి కార్యాలయం నుంచి తప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ముడుపులు ముట్టజెప్పితేనే ..ఫైళ్లు ముందుకు
పీజీ శిక్షణ వెళ్లే వైద్యులకు రిలీవ్ ఆర్డర్లు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, పై నుంచి ఉత్తర్వులు రావాలని సాకు చూపిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇక్కడ కాసులిస్తే తప్ప పనులు కావడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక సీనియర్ అసిస్టెంట్‌ల ఉద్యోగోన్నతి విషయంలో సంతకానికి బట్టి ముడుపులు అడుగుతున్నట్లు కొందరు చెబుతున్నారు. ఆస్పత్రిని బట్టి భారీగా డిమాండ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వసూళ్ల పర్వానికి కొందరు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. ఏసీబీకి ఉప్పందించి రెడ్ హ్యాండడ్‌గా పట్టించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
నిలబడి నీరసించిపోతున్నారు..
గతేడాది వరకు కార్యాలయం కాస్త సాఫీగా సాగింది. అయితే రెండు నెలల కాలంలో ఓ అధికారిని కలవాలంటే వైద్యులు, కార్యాలయ సిబ్బందికి పురిటినొప్పులు పడుతున్నారు. ఆ అధికారి ఛాంబర్ ముందు నిలబడి నీరసించిపోతున్నారు. చీటి రాసి ఇస్తే..తీరిక ఉంటే పిలుస్తున్నారు..లేదంటే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. గంటల తరబడి వేచి ఉండలేక విసిగిపోతున్నారు. కార్యాలయ సిబ్బంది అయితే ఫైళ్లు చేతులో పెట్టుకుని పిలుపు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. ఆ తర్వాత వెళ్లినా ఛీదరింపులు తప్ప ఫైళ్లల్లో సంతకాలు పడడం లేదని వారు వాపోతున్నారు. ఇలా వందల ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు మూలకు చేరాయి. పాత డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభావతి పనిచేసిన సమయంలో ఉన్న ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు 10 వరకు పక్కన పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment