‘నీ ఫ్రెండ్స్ వచ్చారు లేచి చూడరా నాన్న’
● మంచంపై నుంచి పడి పదో తరగతి విద్యార్థి మృతి
పలమనేరు : ‘రే నీ ఫ్రెండ్స్ వచ్చారు లేచి చూడరా నాన్నా’ అంటూ బిడ్డ శవం వద్ద ఆ తల్లి ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. పలమనే రు పాతపేటకు చెందిన టెన్త్ విద్యార్థి శనివారం ఉదయం మంచం పైనుంచి కింద పడి తల వెనుక వైపు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. పట్టణానికి చెందిన గౌషాబాషా కుమారుడు రియాజ్(15) పలమనేరులో ఓ ప్రైవేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం నిద్ర లేచేముందు మంచంపై నుంచి కిందపడి అపస్మారక స్థితిలో ఉండడాన్ని తల్లి గమనించింది. దీంతో బిడ్డను పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. పిల్లాడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. వారం రోజుల్లో పబ్లిక్ పరీక్షలను బాగా చదువుతున్న బిడ్డ ఇలా విగతజీవిగా మారడంపై ఆమె లబోదిబోమంది. ఏటా రంజాన్ మాసంలో ఉపవాసాలు సైతం ఉండే తన బిడ్డ రంజాన్ నెల ఆదివారం వస్తుందనే లోపే ఇలా తమను విడిచిపెట్టి వెళ్లాడని తలచుకుంటూ రోదించింది. కాగా బాలుడి తండ్రి దుబాయ్‌లో ఉంటున్నాడు. ఫోన్ ద్వారా విషయాన్ని ఆయనకు తెలిపారు. వీరికి ఎనిమిదో తరగతి చదివే కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి పిల్లాడిని పోస్టుమార్టానికి తరలించి కేసు విచారిస్తున్నారు. స్కూల్‌లోగాని వీధిలో గాని మంచి పిల్లాడుగా పేరు తెచ్చుకున్న రియాజ్ లేడనే విషయాన్ని అక్కడివారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment