ఆయన హెచ్‌ఎం.. ఆమె పెత్తనం
ఆయన హెచ్‌ఎం.. ఆరోగ్యం సరిగా ఉండదు.. తోడుగా స్కూల్‌కు భార్యను తెచ్చుకుంటాడు. మొదట్లో తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్లిన ఆమె.. మెల్లగా అజమాయిషీ చేయడం మొదలెట్టింది. ఆపై అన్నిటా పెత్తనం చేస్తూ వస్తోంది. అయితే ఏమైనా అనాలంటే హెచ్‌ఎం భార్య. ఏమీ అనలేని పరిస్థితి.. దీంతో తోటి ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు కూడా సరిగా చెప్పలేకపోతున్నారు. ఈ తంతు పలమనేరు పట్టణంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్‌లో జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేరు.
పలమనేరు: సాధారణంగా క్వాలిఫైడ్ ఉన్న వారే హైస్కూల్ హెచ్‌ఎంలుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ ఆ హెచ్‌ఎం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన భార్య రంగంలోకి దిగారు. భర్తకు సాయంగా స్కూల్‌కు వస్తున్న ఆమె క్రమక్రమంగా బడిలో పెత్తనం చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు స్కూల్ మొత్తం ఆమె కంట్రోల్‌లోకి తీసుకోవడంతో టీచర్లు ఇబ్బంది పడుతున్న సంఘటన పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ స్కూల్‌లో 3వ తరగతి నుంచి పదో తరగతి దాకా 724 మంది పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో ఇదే పాఠశాలలో పీఈటీగా పనిచేసి ప్రమోషన్ పొంది ఇక్కడే హెచ్‌ఎంగా షంషీర్ ఏడాది కిందట బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇతని అనారోగ్య కారణాలతో భార్య స్కూల్‌కు తోడుగా రావడం మొదలు పెట్టింది. గత కొన్ని నెలలుగా స్కూల్‌లో హెచ్‌ఎం చేయాల్సిన కొన్ని పనులను ఈమె చేయడంతో పాటు తోటి సిబ్బందిపై అజమాయిషీ చేయడం మొదలు పెట్టినట్టు తెలిసింది. మధ్యాహ్న భోజనానికి బియ్యం, సరుకులు ఇవ్వడం, వారిపై పెత్తనం చెలాయించడం, పిల్లలను సైతం బెదిరించడం, టీచర్‌లాగా కుర్చీల్లో కూర్చోవడం లాంటి పనులు అక్కడ ఉన్న టీచర్లకు సైతం సహించలేదు. కానీ హెచ్‌ఎం భార్య గనుక వారు కూడా ఏమీ చేయలేక మనకెందుకులే అని పట్టించుకోలేదని తెలిసింది.
మధ్యాహ్న భోజనం నుంచి అన్నింటా ఆమె చెప్పిందే వినాలి
స్కూల్ హెచ్‌ఎం భార్య కావడంతో అంతటా పెత్తనం
ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న టీచర్లు, పిల్లలు
పలమనేరులోని ప్రభుత్వ స్కూల్‌లో పూర్తిగా గాడితప్పిన పాలన
మద్యం బాటిళ్లు ఎలా వస్తున్నాయబ్బా ?
హెచ్‌ఎం భార్య విషయమై ఇప్పటికే ఎంఈఓ లీలాకుమారి దృష్టికెళ్లినా హైస్కూల్ హెచ్‌ఎంలపై తమకు సంబంధం లేదని పట్టించుకోలేదని తెలిసింది. ఇలా ఉండగా ఈ మధ్య బడిలోని బాలుర టాయ్‌లెట్లలో దాచిపెట్టిన మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దీంతో అసలు బడిలో ఏం జరుగుతోంది ? ఎవరి కోసం మద్యం బాటిళ్లు తెచ్చారు ? వీటిని లోపలకు ఎవరు తీసుకొస్తున్నారని తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చిత్తూరు డీవైఈఓ చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా తాను తనిఖీ చేసి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment