● ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు ● సీ
ఇంటర్ విద్యార్థులకు సీఎం పర్యటన చుక్కలు చూపించింది. శనివారం ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కాగా పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. ఇదే సమయంలో సీఎం పర్యటనకు సంబంధించిన వాహనాలు వందల సంఖ్యలో రావడంతో చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి మురగానపల్లి వరకు భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో చాలా మంది విద్యార్థులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు పరీక్ష సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు. మరికొంత మంది ఆలస్యంగా చేరుకొని అధికారులను బతిమాలుకొని కేంద్రాల్లోకి వెళ్లిన పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపించింది.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా శనివారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో 50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు/హిందీ/సంస్కృతం/ఉర్ధూ/తమిళం పరీక్షకు జనరల్ విద్యార్థులు 14,480 మందికి గాను 13,794 మంది హాజరుకాగా, 686 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 2,088 మందికి గాను 1,885 మంది హాజరు కాగా 203 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. జిల్లాలో మొదటి రోజు జరిగిన పరీక్షలను డీవీఈవో సయ్యద్ మౌలా చిత్తూరులోని 4, సిట్టింగ్ స్క్వాడ్‌లు 5, ప్‌లైయింగ్ స్క్వాడ్ 03, డీఈసీ మెంబర్‌లు 4, కన్వీనర్ 5, స్పెషల్ ఆఫీసర్ 4 పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
పరీక్షల సమయంలోనే పర్యటన
ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో సీఎం పర్యటన అవసరమా అంటూ పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో సీఎం పర్యటనలు ఉండడం వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. సీఎం పర్యటన వల్ల అధికంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో నగరంలోని సీకేపల్లి వద్ద ఉన్న శ్రీ వివేకానంద కళాశాల కేంద్రం వద్దకు ఒక విద్యార్థిని సెంటర్ తెలుసుకోకుండా వచ్చేశారు. ట్రాఫిక్ సమస్యతో ఆ విద్యార్థిని సీకేపల్లి వద్ద ఉన్న పరీక్ష కేంద్రానికి వచ్చిన సమయం ఉదయం 9.20 గంటలు. వచ్చిన పరీక్ష కేంద్రం సరైనది కాకపోవడంతో మళ్లీ అక్కడ నుంచి వెనుదిరిగి పీసీఆర్ పరీక్ష కేంద్రానికి వెళ్లింది. అప్పుడున్న ట్రాఫిక్ సమస్యకు 3 కి.మీ వరకు పీసీఆర్ పరీక్ష కేంద్రానికి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయితే ఆ విద్యార్థినిని మానవతా దృక్పఽథంతో అధికారులు పరీక్షకు అనుమతించారు. అయినప్పటికీ అర్ధగంట సమయం ఆ విద్యార్థినికి పరీక్ష సమయం వృథా అయింది. ఇదే విధంగా పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులకు లోనయ్యారు.
పరీక్ష కేంద్రాల తికమక
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రాలు తెలియక తికమకకు లోనయ్యారు. నగరంలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష కేంద్రాలు ఎక్కువగా కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోనే ఉన్నాయి. మురగానపల్లిలో ఒకచోటే శ్రీవివేకానంద పేరుతో మూడు పరీక్ష కేంద్రాలు ఉండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తికమక పడ్డారు. పరీక్ష కేంద్రాల వివరాలను సరిగ్గా తెలియజేయకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. గతంలో ముందస్తుగా గూగుల్ రూట్ మ్యాప్‌లతో అవగాహన కల్పించేవారు. ఈసారి అలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
● తిరుపతి జిల్లాకు చెందిన 84 మంది విద్యార్థులను నగరంలోని 12 కేంద్రాల్లో కేటాయించారు. వారందరూ కేంద్రాలు తెలియక ఆందోళనకు గురయ్యారు.
పీసీఆర్ పరీక్ష కేంద్రం వద్ద రూం నంబర్‌లను చూసుకుంటున్న విద్యార్థులు
సీఎం పర్యటనతో అవస్థలు
జిల్లా కేంద్రంలో శనివారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల విద్యార్థులకు ట్రాఫిక్ ఇక్కట్లు అధికమయ్యాయి. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనకు రావడంతో పలు వాహనాలు గాంధీ విగ్రహం నుంచి కొత్తబస్టాండ్, కొంగారెడ్డిపల్లి మీదుగా గంగాధర నెల్లూరుకు వెళ్లాయి. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు సీఎం పర్యటనకు అధికంగా వాహనాలు వెళ్లడంతో కొంగారెడ్డి ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ముందే కొంగారెడ్డిపల్లి వద్ద ఇరుకు రోడ్లు కావడంతో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. గాంధీ విగ్రహం నుంచి ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వరకు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీసులు కరువయ్యారు. కొంగారెడ్డిపల్లి ప్రాంతంలోనే ఎక్కువ సంఖ్యలో పరీక్షా కేంద్రాలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రశాంతంగా పరీక్షలు
మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించాం. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాలను సజావుగా నిర్వహించేందుకు పలు బృందాలు విస్తృతంగా జిల్లాలో పర్యటించడం జరిగింది.
– సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈవో, చిత్తూరు
● ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు ● సీ
● ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు ● సీ
● ఇంటర్ విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు ● సీ
Comments
Please login to add a commentAdd a comment