మనవడిని చంపేశారు.. మనవరాలినైనా అప్పగించండి
● గ్రామస్తులతో కలిసి రోడ్డెక్కిన ఓ కుటుంబం
కార్వేటినగరం : మనవడిని చంపేశారు.. కనీసం తన మనవరాలినైనా మాకు అప్పగించాలని కొల్లాగుంట దళితవాడకు చెందిన కిరణ్ కుటుంబ సభ్యులు శనివారం రోడ్డెక్కారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు... కొల్లాగుంట దళితవాడకు చెందిన కిరణ్ తమిళనాడులోని పల్లిపట్టు గ్రామానికి చెందిన నిషా కలసి పదేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. వారికి సుస్మిత(8), మోటు(6) ఇద్దరు పిల్లలు ఉన్నా రు. అయితే నెల రోజుల కిందట ఇద్దరి పిల్లలతో కలసి నిషా మేల్‌మరవతూరు ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. దీంతో భార్య కావాలని పెద్దల సాయంతో ఎంత ప్రయత్నించినా ఆమె తిరిగీ రాలేదు. కాగా శనివారం కుమారుడు మోటు మృతి చెందినట్లు ఢిల్లీ నుంచి వీడియో కాల్ ద్వారా తెలియ జేయడంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, మా మనవడిని కావాలని వాళ్లే చంపేశారని, అదే విధంగా తన మనవరాలు తమపై బెంగపెట్టుకుని ముఖం వాచిపోయి అనారోగ్యానికి గురైందని , మనవరాలినైనా తమకు అప్పగించాలని రోదిస్తూ గ్రామస్తులతో కలిసి కొల్లాగుంట దళితవాడ వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై రాళ్లు, చెట్ల కొమ్మలను అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మృతికి కారకులైన వారిని శిక్షించాలని భీష్మించి కూర్చున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయం జరిగేలా చూస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment