15 నుంచి ఒంటిపూట బడులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్, గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్‌మెంట్‌లో ఒంటిపూట తరగతులు పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఒంటిపూట బడులు పకడ్బందీగా అమలు చేయాలని డీవైఈవోలు, ఎంఈవోలకు ఉత్తర్వులు పంపారు. పనివేళల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. మార్చి 17వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో సాయంత్రం పూట తరగతులు నిర్వహించాలని సూచించారు.
మహిళా సాధికారత వారోత్సవాలు
చిత్తూరు అర్బన్ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో మహిళా ఉద్యోగులకు యోగాపై శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై యోగా శిక్షకులు వివరించారు. ఈనెల 8వతేదీ వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయని ఎస్పీ మణికంఠ చందోలు పేర్కొన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు. గైర్హాజరయ్యే వారిపై శాఖాపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
భారతీయ జ్ఞానాన్ని
విశ్వవ్యాప్తం చేయాలి
తిరుపతి సిటీ: భారతీయ జ్ఞానం, సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలని శ్రీశైల పీఠం జగద్గురు డాక్టర్ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి పిలుపునిచ్చారు. జాతీయ సంస్కృత వర్సిటీ, బెంగళూరుకు చెందిన అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థాన్ సంయుక్తంగా వర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఆదివారం శక్తి విశిష్టాద్వైతం అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీఠాధిపతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ శక్తి విశిష్టాద్వైతం మహత్వాన్ని ఆధునిక దార్శనికులకు అందించడం శుభపరిణామమన్నారు. సంస్కృత భాష ఔన్నత్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాశీపీఠం జ్ఞానసింహాసనధీశులు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూలో అద్వైత వేదాంత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించి శక్తి విశిష్టాద్వైతం గొప్పతనాన్ని తెలియజేయడం అభినందనీయమన్నారు. ఇందులో సారాంశాన్ని గ్రహించి ఆధ్యాత్మిక తత్త్వ అన్వేషణలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సదుస్సులో వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి, డీన్ రజనీకాంత్‌శుక్లా, ప్రొఫెసర్ గణపతిభట్, సతీష్, నాగరాజభట్, శివరామదాయగుడే, మనోజ్‌షిండే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
15 నుంచి ఒంటిపూట బడులు
Comments
Please login to add a commentAdd a comment