చెరువుకు చెర!
● కబ్జా కోరల్లో ఎస్‌బీఆర్‌పురం చెరువు ● జీఓ నం.188 విరుద్ధంగా చెరువును పూడ్చేస్తున్న సర్పంచ్ ● సుప్రీంకోర్టు ఉత్తర్వులు బే ఖాతర్ ● ఎస్‌బీఆర్‌పురం తటాకాన్ని కాపాడాలంటూ రైతులు డిమాండ్ ● ప్రేక్షకపాత్ర పోషిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
కొండలు, గుట్టలు దోచేస్తున్నారు.. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. పది మందికి ఉపయోగపడే చెరువులనూ వదలడం లేదు కూటమి నేతలు.. ఈ కోవలోనే వడమాలపేట మండలంలో ఓ చెరువుపై కూటమి నేత కన్ను పడింది.. ఇంకేముంది.. పది మందికి ఉపయోగపడే చెరువును పూడ్చే పుణ్యకార్యానికి పూనుకున్నాడు ఆ గ్రామ పెద్ద.. పక్కనే ఉన్న కొండ నుంచి గ్రావెల్ తవ్వి చెరువును పూడ్చే పనులు చకచకా చేపట్టాడు.ఆ కూటమి నేత చెరువును కబళిస్తున్నాడని తెలిసినా అడ్డుచెప్పే ధైర్యం చాలక అధికారులు చేష్టలుడిగి చూస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది.
వడమాలపేట (విజయపురం ) : శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రమైన తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో వడమాలపేట మండలం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉండడంతో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు కొండలు, గుట్టలు, చెరువులు వేటినీ వదలడం లేదు. ప్రభుత్వం స్థలమంటే అధికార పార్టీకి చెందిన ఆస్తులే అన్న చందంగా రెచ్చిపోతున్నారు. ఎంత ఆక్రమించుకోగలిగితే అంత కబ్జాకు తెరతీశారు. జానెడు జాగా కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పేదవారు ఈ తంతును చూసి నివ్వెరపోతున్నారు. ఇదేం పాలనరా బాబూ అంటూ ఆవేదన చెందుతున్నారు. ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ, ఫారెస్టు భూములను ఆక్రమించుకొని మామిడి చెట్లు పెంచుకుంటున్న విషయం బహిర్గతమై రోజులు గడవక ముందే మరో ఆక్రమణ వెలుగు చూస్తోంది. వడమాలపేట మండలం, ఎస్‌బీఆర్‌పురం చెరువు కబ్జా చేయడానికి స్థానిక కూటమి నేత కంకణం కట్టుకున్నాడని, ఇప్పటికే రెండు రోజులుగా చెరువు కట్ట ఆనుకొని ఉన్న కొండలో నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించి చెరువును పూడ్చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అది తప్పని తెలిసినా అధికార పార్టీ నేత కావడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటానికి సాహసించడం లేదు. ఆక్రమిత నేతకు ధన బలం, అధికారం బలం ఉండటంతో అధికారులు అది తప్పు అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. ఆక్రమణకు గురవుతున్న చెరువును కాపాడాలని మాజీ నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, రైతులు కోరుతున్నారు.
జీఓ నంబరు 188కి విరుద్ధంగా ..
ఎస్‌బీఆర్‌పురం చెరువు మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 48 ఎకరాల చెరువు, 439 ఎకరాల మునక పట్టాలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీఓ నం.188 ప్రకారం చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే రైతులు సాగు చేయాలి. సాగు చేసిన తరువాత చెరువు నిండితే వాటిని ఎలాంటి నష్ట పరిహారం చెల్లించరు.
చెరువులో నీరు ఉంటే ఆ భూములను గ్రావెల్‌తో ఎత్తు పెంచడం వంటి పనులు చేయకూడదు. ఆ జీఓకు విరుద్దంగా అధికారి పార్టీకి చెందిన స్థానిక కూటమినేత చెరువులో నీళ్లు ఉండగానే మునక ప్రాంతంలో గ్రావెల్ పోసి ఎత్తు పెంచేస్తున్నాడు. ఇలా గ్రావెల్‌తో చెరువును పూడ్చేయడంతో లోతు తగ్గిపోయి, పూర్తి స్థాయిలో నీరు చెరువులో నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
35 గ్రామాలకు సాగు, తాగునీరు
ఎస్‌బీఆర్‌పురం చెరువు నిండితే సుమారు 35 గ్రామాలకు సాగు, తాగునీరు పుష్కలంగా ఉంటుంది. 20 ఏళ్లుగా తడుకు, చిరుగురాజు పాలెం, గొల్లపల్లి, తోరూరు, కొడలచెరువు, నెసనూరు, పుత్తూరు ప్రాంతాల్లో ఉన్న సాగు, తాగునీటికి ఎలాంటి కష్టాలు రాలేదంటే అది ఈ చెరువులో చేరే నీటి వల్లే అన్నది నిష్టూర సత్యం. అలాంటి చెరువు ఆక్రమణకు గురికావడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నోటీసు జారీ చేశాం
ఎస్‌బీఆర్‌పురం చెరువులో మొత్తం విస్తీర్ణం 487 ఎకరాలు. అందులో 439 ఎకరాలు మునక పట్టాలు. చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే సాగు చేసుకోవాలి. నీళ్లు ఉన్నప్పుడు మట్టితో పూడ్చడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అది చట్టరీత్యా నేరం. సంబంధిత సర్పంచ్‌కి నోటీసు జారీ చేశాం.
– పరశురామ్‌నాయుడు,
నీటిపారుదలశాఖ ఏఈ, పుత్తూరు
అది పట్టా భూమి
రైతుల ఫిర్యాదు మేరకు మా సిబ్బంది సర్వే చేయడం జరిగింది. అది అతని పట్టా భూమి అని తెలిసింది. చెరువు నిండుగా నీళ్లు ఉండడంతో మోటారు మునిగిపోతుందని గ్రావెల్ తోలి ఎత్తు పెంచుకున్నాడు. గ్రావెల్ తరలించడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. – జరీనా,
వడమాల పేట, తహసీల్దార్
అధికారులు చెరువును కాపాడాలి
ఎస్‌బీఆర్‌పురం సర్పంచ్ చేస్తున్న పని చూ స్తుంటే కంచే చేనును మేస్తున్నట్లు ఉంది. పంచాయతీకి సంబంధించిన భూమి, చెరువు, గుంటలను కాపాడాల్సిన సర్పంచ్ చెరువును పూడ్చేయడం అన్యాయం. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచి అధికారంతో ఇలా చేయడం ఎంత వర కు న్యాయం. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన చె రువును వెంటనే స్వాధీనం చేసుకొని, గ్రావెల్‌ను బయటకు తొలగించాలి. – శ్రీనివాసులురెడ్డి, నీటి పారుదల సంఘం మాజీ అధ్యక్షుడు
చెరువుకు చెర!
Comments
Please login to add a commentAdd a comment