ఆర్టీసీ బస్సులో నగదు, బంగారం చోరీ
చిత్తూరు అర్బన్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దామలచెరువుకు చెందిన మహిళ నుంచి రూ. లక్ష నగదు, బంగారు నగలు చోరీకి గురయ్యాయి.. వివరాలు ఇలా..దామలచెరువుకు చెందిన ధర్మణి అనే మహిళ మంగళవారం బెంగళూరు వెళ్లేందుకు పాటూరులో పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు చిత్తూరు నగరంలోని పీసీఆర్ కూడలి వద్దకు రాగా కిందకు దిగిన మహిళ తన బ్యాగును చూసుకున్నారు. బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదు, ఓ బంగారు గొలుసు చోరీకి గురైనట్లు గుర్తించారు. తనతో పాటు ప్రయాణం చేసిన మరో మహిళే ఈ చోరీకి పాల్పడినట్లు చెప్పడంతో చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు దీనిపై విచారిస్తున్నారు.
5 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
చిత్తూరు అర్బన్ : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన గోదాముపై పోలీసులు దాడులు చేశారు. చిత్తూరు నగరంలోని కై లాశపురం శ్మశాన వాటిక సమీపంలో ఉన్న గోదాములో రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. టూటౌన్ సీఐ నెట్టికంటయ్య, ఎస్‌ఐ ప్రసాద్ తన సిబ్బంది కలిసి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. గోదాములో నిల్వ చేసిన 5 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వెంకటరమణ, మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో మెనూ పాటించాలి
గంగాధర నెల్లూరు : నియోజకవర్గంలో మంగళవారం ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం, గంగాధర నెల్లూరు, మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, చౌక దుకాణాలు, పీహెచ్‌సీలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గంగాధర నెల్లూరు మండలంలో బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు మధ్యాహ్న భోజనాల నిర్వహణను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించి మంచి నిర్ణయాలతో పాలు, గుడ్లు, వంటి అధిక విటమిన్, ప్రోటీన్‌లు కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందిస్తుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువులో ముందడుగు వేస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ శంకరన్, సివిల్ సప్లై డీఎం బాలకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి వరలక్ష్మి, ఐసీడీఎస్ అధికారి వెంకటేశ్వరి , సాంఘిక, వెనుకబడిన సంక్షేమశాఖ డీడీలు చెన్నయ్య, రబ్బానీ భాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment