చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీ నిధుల స్వాహాపై విచారణ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ జెడ్పీ సీఈవోను ఆదేశించారు. ఈ మేరకు గుండ్లకట్టమంచి గ్రామస్థులు కలెక్టర్‌కు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు విచారణ అధికారిని నియమించారు. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా.. గుండ్లకట్టమంచి గ్రామంలో మూడేళ్లుగా ఎలాంటి పారిశుద్ధ్య పనులు చేయకుండానే సర్పంచ్ శ్రీనివాసులు తన భార్య నాగలక్ష్మి పేరుతో నిధులను స్వాహా చేసినట్లు పేర్కొన్నారు. ఎటువంటి బిల్లులు, ఎం బుక్ లేకుండానే తన భార్య పేరుతో రూ.10 లక్షల వరకు గ్రామ పంచాయతీ నిధులను స్వాహా చేశారన్నారు. ఈ వ్యవహారంలో గ్రామ సెక్రటరీ ఉమాపతి నకిలీ బిల్లులను సృష్టించి కీలకపాత్ర వహించినట్లు తెలిపారు. చివరకు చిరు ఉద్యోగులైన గ్రీన్ అంబాసిడర్‌ల వేతనాలు దాదాపు రూ.2 లక్షల వరకు సర్పంచ్ భార్య పేరుతో నకిలీ ఓచర్లను సృష్టించి కాజేశారన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులకు ఎటువంటి బిల్లులు, ఎంబుక్కులు లేకుండా దాదాపు రూ.8 లక్షలు చట్టవిరుద్ధంగా చెక్కుల రూపంలో నిధులను విత్‌డ్రా చేసి స్వాహా చేశారని ఆరోపించారు. నిధులను స్వాహాకు సంబంధించి ఆధారాలు సైతం అందజేశామని కలెక్టర్ విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు.
ముగిసిన అంతర్జాతీయ సదస్సు
తిరుపతి సిటీ : జాతీయ సంస్కృత వర్సిటీలో శక్తివిశిష్టాద్వైతం అనే అంశంపై మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు మంగళవారంతో పరిపూర్ణమైంది. ముఖ్యఅతిథిగా కాశీపీఠం శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశులు జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వారాధ్య శివాచార్యులు హాజరయ్యారు. శక్తి విశిష్టాద్వైత కేంద్రాన్ని వర్సిటీ ఏర్పాటు చేయడం సంతోషకరమని, విద్యార్థులకు శాస్త్ర అధ్యయనానికి ఎంతో ఉపకరిస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో బెనారస్ హిందూ వర్సిటీ ప్రొఫెసర్ రాజారాం శుక్లా, రిజిస్ట్రార్ కేవీ నారాయణరావు, ప్రొఫెసర్ గణేష్ భట్, శివరామదాయగుడే, మనోజ్‌షిండే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment