ఆలయం వద్ద మద్యం షాపు వద్దు
పుత్తూరు: స్థానిక నగరంరోడ్డులోని శ్రీఆంజనేయస్వామి ఆలయ సమీపంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి సన్నహాలు చేస్తున్నారని, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మద్యం షాపును ఏర్పాటు చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎకై ్సజ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆలయం ఎదురుగానే గ్రంథాలయం, సినిమా హాలు ఉన్నాయని. ఇక్కడ మద్యం షాపునకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. నగరం రోడ్డు అనునిత్యం భారీ వాహనాలతో రద్దీగా ఉంటుందని, ఇదే ప్రదేశంలో పలు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మద్యం షాపు ప్రారంభిస్తే, తాగి తూలుతూ తిరిగే మద్యం ప్రియులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక్కడి పరిస్థితులను అనుసరించి అధికారులు మద్యం దుకాణానికి అనుమతులు ఇవ్వకూడదని వారు కోరుతున్నారు.
పంటలపై గజ దాడులు
పెద్దపంజాణి: మండలంలోని పలమనేరు రేంజ్ కీలపట్ల ఫారెస్టు బీట్ నుంచి వచ్చిన ఏనుగులు ముదిరెడ్డిపల్లికి చెందిన రమణారెడ్డి తదితరుల టమాట పంటను తొక్కి నాశనం చేశాయి. మామిడి చెట్లను విరిచేశాయని బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న రాయలపేట ఫారెస్టు బీట్ ఆఫీసర్ రవికుమార్ బుధవారం పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపరిహారం మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. ఏనుగులు పంటలపైకి రాకుండా ట్రాకర్ల సాయంతో అడవిలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మండలంలోని పెద్దకాప్పల్లి పంచాయతీ అటవీ సరిహద్దు గ్రామాలైన తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాప్పల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్, ఆకులవారిపల్లి రైతులకు చెందిన పంటలను గత కొంతకాలంగా ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment