● రేషన్ షాపుల్లో బియ్యం గోల్‌మాల్ ● 250 షాపులకుపైగా స
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి అంతే లేకుండాపోయింది. పేదల కడుపు నింపాల్సిన బియ్యం పెద్దల జేబులు నింపుతోంది. కూటమి నేతలు బియ్యం దొంగలుగా మారడంతో అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఎడాపెడా వారు మేసేస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ కోటాలో పేదలకు రేషన్ సరఫరాలో కోత పడింది. ఫలితంగా నిరుపేదలు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమి పెద్దలు పేదల బియ్యాన్ని చౌకగా దోచేస్తున్నారు. దీంతో ఏప్రిల్ నెల కోటాలో భారీగా కోత పడింది. ప్రభుత్వం జిల్లాకు బియ్యం కేటాయింపును కుదించింది. ఈ కారణంగా పలు షాపులకు జీరో స్టాక్, మరికొన్ని షాపులకు 10 శాతంతో సరిపుచ్చింది. కార్డుదారులు అయోమమయంలో పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డీలర్ షాపులను లాక్కునే ప్రయత్నం చేశారు. కొన్ని ఏళ్లుగా షాపుల నిర్వహిస్తున్న వారిని కూడా వదలకుండా పట్టి పీడించారు. బెదరింపులకు గురిచేశారు. అధికారుల ద్వారా అనధికారిక కేసులు పెడతామని, షాపులు వదిలేయండంటూ బహిరంగంగానే భయపెట్టారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 250 పైగా షాపులను బలవంతంగా లాగేసుకున్నారు. ఆ తర్వాత మండల స్థాయి అధికారులకు జాబితా పంపి షాపుల కేటాయింపు చేయించుకున్నారు.
కొల్లగొట్టేశారు!
బెదిరించి, భయపెట్టి షాపులు దక్కించుకున్న కూటమి నేతలు రేషన్ షాపుల్లోనే సరుకులను కొల్లగొట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బియ్యం అక్రమంగా తరలించి, కిలో రూ. 10 నుంచి రూ. 17 వరకు విక్రయించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక కొత్తగా డీలర్ అవతారమెత్తిన నేతలు ఈ బియ్యాన్ని అక్రమంగా విక్రయించుకున్నారు. మూడు నెలలుగా సీబీ (క్లోసింగ్ బ్యాలెన్స్) కూడా చూపించలేదు. ఇలా టన్నుల కొద్ది రేషన్ బియ్యం మాయమైంది. గత 9 నెలల కాలంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వలతోపాటు రవాణా అవుతున్న 80 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అయినా పౌరసరఫరాలశాఖ అధికారులు అధికారానికి తలొగ్గి మిన్నకుండిపోయారు. దీని ప్రభావం పేదలపై పడింది. గత 9 నెలల కాలంలో కూటమి నేతలు అక్రమ బియ్యం వ్యాపారంలో పట్టుబడడం ఈ అక్రమానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు.
అక్రమ బాగోతంతోనే కోత
జిల్లాలో 1,390 రేషన్ కార్డుదారులున్నారు. ఈ షాపులకు 14 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ సరుకులు సరఫరా అవుతాయి. జిల్లావ్యాప్తంగా 5.40 లక్షల కార్డులుండగా బియ్యం ప్రతి నెలా వంద శాతం రేషన్ పంపిణీ జరిగితే 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. మిగులు సరుకులు ఆధారంగా షాపులకు సరుకులు కేటాయిస్తుంటారు. ఈ తరుణంలో 9 వేల మెట్రిక్ టన్నుల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల వరకు బియ్యం జిల్లాకు సరఫరా అవుతుంది. ఏప్రిల్ నెలకు గాను 8 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపుతో 6 షాపులకు జీరో స్టాక్ కేటాయింపు జరిగింది. 40 షాపులకు 10 శాతం అలాట్ అయింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని డీలర్లు చెబుతున్నారు. జిల్లాలోని 40 వేల కార్డులకు వచ్చే నెల సరుకులు అందడం కష్టతరంగా ఉందని శాఖ అధికారులు అంటున్నారు. ఊహించని ఈ పరిణామంతో పలువురు డీలర్లు విస్తుపోతున్నారు. ఆ అరకొర సరుకులు మా కొద్దన్ని డీలర్లు పలు చోట్ల తిరస్కరిస్తున్నారని సమాచారం. కాగా వచ్చే నెల ప్రజలకు ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియక డీలర్లు అయోమయంలో పడ్డారు.
పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యమే
జిల్లాలో కళ్ల ఎదుటే అక్రమాలు జరుగుతున్నా అధికారులు కుర్చీలకు పరిమితమయ్యారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమయ్యారు. గత కొన్ని నెలలుగా షాపుల్లోని నిల్వలను గుర్తించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలకు తలొగ్గి, బియ్యం అక్రమ వ్యాపారాన్ని పెంచి పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 9 నెలలుగా అక్రమాలపై ఫిర్యాదులు వస్తున్న ఆ శాఖ అధికారులు పూర్తిగా కనుమరుగయ్యారు. అడపాదడపా పోలీసులకు ఫిర్యాదులు వెళ్లడంతో రేషన్‌బియ్యం అక్రమ వ్యాపారం బట్టబయలవుతోంది. ఇప్పుడు కూడా ఆశాఖ అధికారులు ఈ వ్యవహారాన్ని కప్పి పుచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో బియ్యం నిల్వ
ఇదిగో సాక్ష్యం...
ఇటీవల చిత్తూరు నగరం వినాయకపురంలోని 41వ షాపుల్లో రేషన్ ఇవ్వకుండా దోచుకుంటున్నారని కార్డుదారులు ఆందోళనకు దిగారు. షాపునకు వచ్చిన రేషన్‌ను డీలర్ అక్రమంగా అమ్మేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది గందరగోళంగా మారడంతో విచారణకు దిగిన అధికారులు బియ్యం 37 క్వింటాళ్లు, చక్కెర 28 కేజీలు తేడా ఉన్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. ఈ డీలర్ కూటమి నేతగా చలామణి అవుతున్నారు. ఈ షాపునకు జీరో స్టాక్ పడిందని సమాచారం.
చిత్తూరు నగరం మురకంబట్టులోని తిమ్మసముద్రంలోని కూటమి నేత మూస ఇంట్లో 101 క్వింటాళ్ల బియ్యం నిల్వలను పట్టుకున్నారు. ఓ ప్రైవేటు గదిలో ఉన్న బియ్యాన్ని గుర్తించిన తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 9 నెలల కాలంలో కూటమి నేతలు చేస్తున్న అక్రమ వ్యాపారం ఈ రెండు మాత్రమే కాదు. పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇన్ని ఆధారాలున్నా.. అక్రమ వ్యవహరాన్ని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా వ్యవహరించిన డీలర్లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లా సమాచారం..
ఎంఎల్‌ఎస్ పాయింట్లు – 14
జిల్లాలో రేషన్‌షాపులు – 1,379
కార్డులు – 5.40 లక్షలు
వందశాతం రేషన్ పంపిణీకి
కావాల్సిన బియ్యం –
ప్రతినెలా జిల్లాకు
అవసరమైన బియ్యం –
చక్కెర – 3.15 వేల న్నులు
ఈనెల ప్రభుత్వం సరఫరా
చేసిన బియ్యం – 8 వేల టన్నులు
కోత పడిన బియ్యం – వెయ్యి టన్నులు
జీరో స్టాక్ షాపులు – 6
10 శాతం కేటాయింపు
జరిగిన షాపులు – 40
వచ్చే నెల సరుకులు
కోత పడే కార్డులు – సుమారు 40 వేల కార్డులు
15 వేల
మెట్రిక్ టన్నులు
9 వేల నుంచి 10
వేల మెట్రిక్ టన్నులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు
ఈ కోతలు చిత్తూరులోనే జరిగినట్టు భూతద్దంలో చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అనంతపురం, అన్నమయ్య జిల్లాలో మరింత తీవ్రంగా ఉంది. దానికి మేము ఏం చేయాలో చేస్తున్నాం. జీరో స్టాక్, తక్కువగా సరుకు వచ్చిందని ఎక్కడైనా చూపించమని చెప్పు. ఇంకా షాపులకు సరుకులే దిగలేదు. అప్పుడే ఎలా తెలిసిపోతాయి. జేసీ పిలిచి మాట్లాడారు. విషయం చెప్పాం.
– శంకరన్, డీఎస్‌ఓ, చిత్తూరు