
రెండు ఏఎంసీలకు చైర్‌పర్సన్ల నియామకం
చిత్తూరు అర్బన్: జిల్లాలోని రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్‌పర్సన్లను నియామకం జరిగింది. ఈ మేరకు నగరికి డి.రాజమ్మ, గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్‌ఆర్ పురం ఏఎంసీకి జి.జయంతిని చైర్‌పర్సన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఊరిస్తూ వచ్చిన మార్కెట్ కమిటీల చైర్‌పర్సన్ల నియామకంలో కూటమి నేతలకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. జిల్లాలో పది వ్యవసాయ మార్కెట్ కమిటీలుంటే.. కేవలం రెండు చోట్ల మాత్రమే చైర్‌పర్సన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండూ కూడా టీడీపీకే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా జిల్లాలో కుప్పం, పుంగనూరు, రొంపిచెర్ల, సోమల, చిత్తూరు, పలమనేరు, పెనుమూరు, బంగారుపాళెం కమిటీలకు చైర్‌పర్సన్లను ప్రకటించలేదు. దీంతో పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో మరోసారి నిరాసక్త నెలకొంది. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లు పాటిస్తారో..? మళ్లీ ఏదైనా మారుస్తారా..? కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ, జనసేనకు న్యాయం చేస్తారా..? అనే అనుమానం కూటమి నేతలను వెంటాడుతోంది.
మాతృమరణాలు నివారించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మాతృమరణాలు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఐఓ హనుమంతరావు ఆదేశించారు. చిత్తూరు నగరంలోని డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం మాతృమరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వి.కోట గ్రామానికి చెందిన ఓ గర్భిణి బీపీ ఎక్కువై, గుండె నొప్పి రావడంతో 108లో తరలిస్తున్న సమయంలో మృతి చెందిందన్నారు. ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ కేసులను నిత్యం పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు ఉషశ్రీ, లత, రమ్య, అనూష, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.