
కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి
● హామీలు పరిష్కరించకపోతే ఆందోళనలు ● కలెక్టరేట్ ఎదుట ఫ్యాఫ్టో నాయకుల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి తో వ్యవహరించాలని, టీచర్ల హామీలను వెంటనే పరిష్కరించాలని ఫ్యాఫ్టో (ఉపాధ్యాయ సంఘ సమాఖ్య) జిల్లా చైర్మన్ మణిగండన్ డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూ టమి నేతలు ఉపాధ్యాయుల సంక్షేమానికి పలు హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఫ్యాఫ్టో రాష్ట్ర నాయకులు గంటామోహన్ మాట్లాడుతూ జీఓ నంబర్ 117 అమలుకు ముందు ఉన్న తెలుగు మీడియం, మైనర్ మీడియం పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం అంగీకరించకపోవడం అన్యాయమన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో సైతం స్థానిక భాషలో బోధన చేయాలని ఉందని, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుభాష ఆత్మాభిమానం పునాదిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం తెలుగు మీడియం రద్దుకు కంకణం కట్టుకోవడం సబబుకాదన్నారు.
ఆర్థికపరమైన అడ్డంకులు తొలగించాలి
ఉపాధ్యాయులు విధి నిర్వహణ అడ్డుగా ఉన్న ఆర్థిక పరమైన అడ్డంకులను కూటమి ప్రభుత్వం వెంటనే తొలగించాలని ఫ్యాఫ్టో రాష్ట్ర నాయకుడు జీవీ రమణ డిమాండ్ చేశారు. సీపీఎస్, జీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులకు కూటమి నేతలు ఇచ్చిన హామీలు అము చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లను పరిష్కరించాలని డీఆర్వో మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఫ్యాఫ్టో ప్రధాన కార్యదర్శి మునీర్ రెహమాన్, ఉపప్రధానకార్యదర్శి మదన్ మోహన్‌రెడ్డి, ముక్తార్ అహ్మద్, మునాఫ్ , నాయకులు సోమశేఖర్‌నాయుడు, మోహన్‌యాదవ్, కిరణ్, లక్ష్మిపతిరెడ్డి, జ్యోతిరామ్, సుధాకర్‌రెడ్డి, రెడ్డెప్పనాయుడు, ఎస్పీభాషా, రెహానాబేగం, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.