కార్వేటినగరం:సారా స్థావరాలపై దాడులు చేసి, ఊటను ధ్వంసం చేయడంతోపాటు ఇందుకు బాధ్యుడైన జనసేన నాయకుడిపై ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వెదురుకుప్పం మండలంలోని చిన్ననక్కలాంపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో సారా స్థావరాలపై గురువారం చిత్తూరు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పవన్‌కుమార్, సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో చిన్న నక్కలాంపల్లె గ్రామానికి చెందిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నీలాలయ్య కుమారుడు పరమేశ్వర్ పొలంలో సారా తయారీకి నాలుగు డ్రమ్ముల్లో సిద్ధంగా ఉంచిన 800 లీటర్ల నల్లబెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి పరమేశ్వర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా నిందితుడు పరమేశ్వర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. డ్రమ్ములను కార్వేటినగరం సీఐ శిరీషదేవికి అప్పగించినట్లు చెప్పారు. త్వరలో పరమేశ్వర్‌ను అరెస్టు చేస్తామన్నారు. అలాగే మాంబేడు గ్రామంలో కార్వేటినగరం సీఐ శిరీషదేవి ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈదాడుల్లో అదే గ్రామానికి చెందిన ధర్మారెడ్డి వద్ద ఉన్న సారాను స్వాదీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడగ్గా నక్కలాంపల్లె గ్రామంలో పరమేశ్వర్ వద్ద తెచ్చకున్నట్లు ధర్మారెడ్డి చెప్పాడని సీఐ తెలిపారు.
పలు గ్రామాలకు సరఫరా
చిన్న నక్కలాంపల్లె గ్రామానికి చెందిన పరమేశ్వర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇతను జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పొన్న యుగంధర్‌కు సన్నిహితుడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సారా తయారు చేసి విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతను తయారు చేసిన సారా పలు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో అనేక సార్లు పోలీసులు పట్టుకుంటే వెంటనే జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి యుగంధర్‌తో అధికారులపై ఒత్తిడి తెచ్చి కేసులు లేకుండా తప్పించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. అటవీ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమగా నెలకొల్పి నాటు సారా సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.