వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా వెంకటరమణ
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన టి.వెంకటరమణను చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది.
మాతాశిశు మరణాలు
కట్టడి చేయాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మాతా శిశు మరణాలను కట్టడి చేసేందుకు వైద్య బృందం సమష్టిగా పని చేయాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణుల సేవలను విస్తృతం చేయాలని గైనిక్ వైద్యురాలు ఉషశ్రీ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం మాతా శిశు మరణాలపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. వైద్య సిబ్బంది ప్రణాళిక ప్రకారం పనిచేయాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మాతృ మరణాల నివారణకు వైద్య శాఖ చేస్తున్న సేవలపై గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. హైరిస్క్ కేసులపై నిర్లక్ష్యం చూపకుండా మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. మాతృ మరణాల నివారణలో భాగంగా గర్భిణుల సేవల్లో నిర్లక్ష్యం ఉండకూడదని ఉషశ్రీ పేర్కొన్నారు. సమావేశంలో వైద్యులు అనూష, లత, ఐసీడీఎస్ పీడీ అయేషా, 108 మేనేజర్ మోహన్‌బాబు పాల్గొన్నారు.
సీనియారిటీ జాబితాలో తప్పిదాలు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సీనియారిటీ జాబితాల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ ప్రాతిపదికన, మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే తయారు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ ఉద్యోగోన్నతికి అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్‌ల సీనియారిటీ జాబితాను ప్రచురిస్తారన్నారు. 117 జీఓ రద్దు విషయంలో మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు పేరెంట్ కమిటీల ఆధారంగానే ఉంటాయని తెలిపారు. హైస్కూల్ ప్లస్‌లను కొనసాగిస్తారన్నారు. ఎయిడెడ్ నుంచి గవర్నమెంట్, జిల్లా పరిషత్‌లో విలీనం అయిన వారికి విలీనం అయ్యేటప్పుడు అమలు చేసిన ఉత్తర్వుల మేరకే సర్వీస్ వెయిటేజ్ ఇస్తారన్నారు. అంతర్ జిల్లా బదిలీలు, అంతర్ మున్సిపాలిటీ బదిలీలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా వెంకటరమణ
Comments
Please login to add a commentAdd a comment